శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శనివారం, 10 సెప్టెంబరు 2016 (16:01 IST)

వెలగ పండుతో ఈ అనారోగ్య సమస్యలు దూరం... ఏంటవి?

వినాయక చవితినాడు గణపతికి సమర్పించే 21 రకాల పండ్లలో వెలగ పండు తప్పనిసరి అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇది విఘ్నేశ్వరుడికి నైవేద్యంగానే కాదు... ఔషధంగా కూడా మనకు చాలా మేలు చేస్తుంది. వెలగ పండుతో పాటు ఈ చెట్టు బెరడూ, పూలూ, వేళ్లూ, ఆకులూ అన్నీ ఔషధభరితమే.

వినాయక చవితినాడు గణపతికి సమర్పించే 21 రకాల పండ్లలో వెలగ పండు తప్పనిసరి అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇది విఘ్నేశ్వరుడికి నైవేద్యంగానే కాదు... ఔషధంగా కూడా మనకు చాలా మేలు చేస్తుంది. వెలగ పండుతో పాటు ఈ చెట్టు బెరడూ, పూలూ, వేళ్లూ, ఆకులూ అన్నీ ఔషధభరితమే. కానీ వినాయకుడికి ఎంతో ప్రీతిపాత్రమైన వెలక్కాయని కేవలం పూజాఫలంగా చూస్తామే తప్ప, అమృత తుల్యమైన దాని ఔషధ గుణాల్ని అంతగా పట్టించుకోం. ఆహారంలో భాగంగా చేసుకోవడానికి ప్రయత్నించం. అందుకే ఇవి చవితి సమయంలో మాత్రమే మార్కెట్లో సందడి చేస్తుంటాయి. అయితే అంతకుమించిన ఔషధ గుణాలెన్నో అందులో దాగున్నాయి. 
 
100 గ్రా. వెలగపండు గుజ్జు నుంచి 140 క్యాలరీలు వస్తాయి. 31 గ్రా. పిండిపదార్థాలూ, 2 గ్రా. ప్రొటీన్లు, బీటా కెరోటిన్‌, థైమీన్‌, రిబోఫ్లోవిన్‌, నియాసిస్‌, కాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, ఆక్సాలిక్‌, మాలిక్‌, సిట్రిక్‌ అమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఇది అనేక వ్యాధుల నివారణలో ఔషధంగా పనిచేస్తోంది. ఆయుర్వేద వైద్యంలో వాంతులు, విరేచనాలు, జ్వరం, మలబద్దకం వంటి వ్యాధులకు ఈ పండు మంచి మందు. 
 
అల్సర్‌తో బాధపడే వారు ఈ పండు తింటే ఉపశమనం కలుగుతుంది. వెలగ పండు గుజ్జుతో చేసిన జ్యూస్‌ను 50 మి.గ్రా. తీసుకుని గోరువెచ్చని నీళ్లలో కలిపి తాగితే రక్తశుద్ధికీ మంచిది. రక్తహీనతను నివారించే ఇనుమూ దీన్నుంచి లభిస్తాయి. ఆగకుండా ఎక్కిళ్లు వచ్చినప్పుడు ఈ పండు జ్యూస్ తాగిస్తే తగ్గుతాయి. అలసట, నీరసం ఆవహించినప్పుడు గుజ్జులో కాస్త బెల్లం కలిపి తింటే శక్తి వస్తుంది. మూత్రపిండాల సమస్యతో బాధపడేవాళ్లకి తరుచూ ఈ పండ్లు తినడం వల్ల ఆ సమస్యలు తగ్గుముఖం పడుతాయి. 
 
మూత్రపిండాల్లో రాళ్లు కూడా తొలగిపోతాయి. వెలగపండు గుజ్జుకి తగినంత గోరువెచ్చని నీళ్లూ, కొద్దిగా పంచదార కలిపి తీసుకుంటే రక్తంలో పేరుకున్న వ్యర్థాలు తొలగిపోతాయి. దీంతో కాలేయం, కిడ్నీలపై అధిక పనిభారం పడకుండా ఉంటుంది. స్త్రీలు ఈ పండు గుజ్జు క్రమం తప్పకుండా తినడం వల్ల రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. వెలగపండు గుజ్జు వీర్యవృద్ధికీ తోడ్పడుతుంది. ఈ పండు గుజ్జు తినడం వల్ల ప్రొటీన్లు సమపాళ్లలో అంది కండరాలు వేగంగా వృధ్ధి చెందుతాయి. వెలగపండు గుజ్జుకి మధుమేహాన్ని అదుపులో ఉంచే శక్తి ఉంది. ఈ పండుకి 21 రకాల బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉంది. నోటి పుండ్లనీ తగ్గిస్తుంది. పొట్టలో పేరుకున్న గ్యాస్‌నీ తొలగిస్తుంది. నరాలకూ ఉత్తేజాన్నీ, శక్తినీ ఇస్తుంది.