1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By Chitra
Last Updated : శనివారం, 12 డిశెంబరు 2015 (17:13 IST)

వైకుంఠ ఏకాదశి అంటే ఏమిటి.. ధనుర్మాస పూజ ఎలా చేయాలి?

ధనుర్మాసంలో మార్గశిర పుష్యమాసాల్లో వచ్చే శుక్లపక్షఏకాదశిని ''వైకుంఠఏకాదశి"గా  పిలుస్తారు. దీన్నేముక్కోటి ఏకాదశి అనికూడా అంటారు. సౌరమానం ధనుర్మాసం కాగా, అందులో వచ్చే వైకుంఠ ఏకాదశి చాంద్రామానానుసారిణి. శ్రీమన్నారాయణునికి సూర్యుడు కుడికన్ను. చంద్రుడు ఎడమకన్ను. కన్నులు వేర్వేరుగా ఉన్నా దృష్టి ఒక్కటే ఐన్నట్లు, సూర్యచంద్రులు వేర్వేరుగా కన్పిస్తున్నా కాంతితత్వం ఒక్కటే అనే మహత్త్యాన్ని ఈ పండుగ సూచిస్తుంది.
 
వైకుంఠ ఏకాదశిలో వైకుంఠ, ఏకాదశి అని రెండు పదాలున్నాయి. వైకుంఠ శబ్ధం విష్ణువునూ విష్ణు వుండే స్థానాన్నీ కూడా సూచిస్తుంది. వైకుంఠము శ్వేతద్వీపమైన విష్ణుదేవుని స్థానం. పునరావృత్తి లేనిదీ, శాశ్వతమైనదీ అగు విష్ణుదేవుని పరంధామం. జీవులు, వైకుంఠుణ్ణి అర్చించి, ఉపాసించి, వైకుంఠాన్ని చేరుటే ముక్తి. శరీరంలోని అన్ని ఇంద్రియాలు, ఇంద్రియ అధిష్ఠాననారాయణుణ్ణి సేవించడమే భక్తి. ఇట వైకుంఠమంటే పరంధామం. ఏకాదశి అంటే పదకొండు ఇంద్రియాల సమూహం. 
 
ఈ పదకొండు ఇంద్రియాలూ వైకుంఠుణ్ణి అర్చించి, సేవించి, ఉపాసించినపుడే అవి పవిత్రవంతాలై వాటి ద్వారా సుఖానుభూతి నొందేజీవుణ్ణి వైకుంఠంలో చేరుస్తాయి. కాగా ఏకాదశేంద్రియాలను వైకుంఠునికి అర్పణం చేసి, వైకుంఠా‌న్నిచేరి, శాశ్వతముక్తి నొంది, ధన్యులుకండి అని వైకుంఠ ఏకాదశి బోధిస్తుంది. 
 
ఏకాదశినాటి ఉపవాసం సత్త్వగుణానికి సంకేతం. ఒకవస్తువుకు మిక్కిలి దగ్గరగా మరొకవస్తువు నుంచినపుడు మొదటి వస్తువు యొక్క గుణం, వాసన రెండో దానిపై ప్రభావితం చూపుతాయి. అట్లే ఏకాదశేంద్రియాలతో కూడిన జీవాత్మ, వైకుంఠానికి- ఉప సమీపంలో వాసః=నివసించడం వల్ల అత్యంతసామీప్య, సాన్నిధ్య ప్రభావం కారణంగా జీవాత్మపై పరమాత్మ ప్రభావం ప్రసరిస్తుంది. 
 
ద్వాదశినాడు చక్రస్నానం గావించి, స్వామి ప్రసాదాన్ని స్వీకరించడంతో ద్వాదశాక్షరీమంత్రమయమైన వాసుదేవతత్వాన్ని అనుభవిస్తాడు. ఈ అనుభవమే కలియుగవైకుంఠమైన తిరుమల శ్రీ పుష్కరిణిలో ముక్కోటి ఏకాదశి చక్రస్నానఫలం ద్వారా లభిస్తుంది. 
 
శ్రీవారిని ప్రణవమూర్తిగా ఉపాసించుటే ధనుర్మాస పూజ. అందు ''వైకుంఠఏకాదశి" సర్వసమర్పణరూపమైన త్యాగానికి, శుద్ధస్తత్వగుణానికి సంకేతం. అట్టి సుదర్శనరూపుని చేతిదివ్యాయుధం - సుదర్శనచక్రం. ఇది కాలచక్రానికి, దర్శన మాత్రంతోనే ముక్తినిచ్చేందుకు ప్రతీక. ఇంతటి ప్రభావసంపన్నమైన వైకుంఠ ఏకాదశినీ, ద్వాదశినీ భక్తిశ్రద్ధలతో ఆచరించినవారికి పునర్జన్మ ఉండదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.