సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (12:39 IST)

ఉక్రెయిన్‌ రైల్వే స్టేషన్‌పై రష్యా క్షిపణి దాడి - 22 మంది మృతి

russia strike
గత ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతోంది. నెలలు గడిచిపోతున్నప్పటికీ ఈ యుద్ధానికి అంతం అనేది కనిపించడం లేదు. ఈ క్రమంలో తాజాగా ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో 22 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. 
 
మరోవైపు, ఉక్రెయిన్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తమపై రష్యా ఎన్ని దాడులు చేసినా వెనుకంజ వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాతో పాటు ఇతర ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. 
 
తాజాగా దాడిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యూనైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు వీడీయో ప్రసంగం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దళాలు దాడులు మొదలుపెట్టిన ఆరు నెలల వ్యవధిలో తమ దేశ స్వాతంత్ర్యం దినోత్సవం రోజున రష్యా చేసిన ఈ దాడి అసహ్యమైనదన్నారు. 
 
తమను రెచ్చగొట్టే విధంగా ఉందన్నారు. రష్యా చేసిన ప్రతి దానికీ ఆ దేశం బాధ్యత వహించేలా చేస్తామన్నారు. తాజాగా జరిపిన క్షిపణి దాడిలో మరో 22 మంది చనిపోయారని జెలెన్ స్కీ వెల్లడించారు.