విమానం టైర్లు పట్టుకుని వేలాడుతూ కిందపడిన ఆప్ఘన్ ప్రజలు
ఆప్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్ తీవ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడుగా ఉన్న అష్రఫ్ ఘనీ దేశం విడిచిపారిపోయారు. దీంతో కొత్త అధ్యక్షుడుగా బరాదని నియమితులుకానున్నారు. అయితే, కాబూల్‌ను తాలిబన్ తీవ్రవాదులు ఆక్రమించుకున్న తర్వాత దేశంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి.
ప్రస్తుతం ఆ దేశంలో ఎంతటి దారుణమైన, భయానక పరిస్థితులు ఉన్నాయో కళ్లకు కట్టే సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎలాగైనా సరే దేశం నుంచి బయటపడాలని చూస్తున్న వేల మంది ఆఫ్ఘన్లు.. ఎయిర్‌పోర్ట్‌లోకి దూసుకొస్తున్నారు. ఏ విమానం దొరికితే అందులో ఎక్కడానికి ఎగబడుతున్నారు.
అయితే ఇలా లోనికి వెళ్లలేకపోయిన వాళ్లలో కొంతమంది విమానం టైర్లను గట్టిగా పట్టుకొని బయటపడటానికి ప్రయత్నించారు. అయితే విమానం గాల్లోకి ఎగిరిన కాసేపటికే.. అలా టైర్లను పట్టుకొని వేలాడుతున్న ముగ్గురు కింద పడిపోయారు. వాళ్లంతా ఆ దగ్గర్లోని ఇండ్లపై పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.