శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 జులై 2021 (16:46 IST)

రోదసిలోకి తొలి తెలుగు మహిళ.. రోదసియానం విజయవంతం (video)

Sirisha Bandla
రోదసిలోకి తొలిసారి ఒక తెలుగు మహిళ విజయవంతంగా అడుగుపెట్టారు. వర్జిన్ గెలాక్టిక్ యజమాని, బ్రిటన్ వ్యాపారవేత్త సర్ రిచర్డ్ బ్రాన్సన్‌తో పాటు బండ్ల శిరీష, మరో నలుగురు ఈ రోదసియానం చేశారు. ఈ చరిత్రాత్మకయానం భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 8 గంటలకు ప్రారంభమైంది. నిజానికి ఈ రోదసియానం సాయంత్రం 6.30కి మొదలు కావాల్సి ఉంది. 
 
అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో 90 నిమిషాలు ఆలస్యంగా ఇది మొదలైంది. ఈ యాత్రలో భాగంగా గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్‌కు చెందిన మానవ సహిత వ్యోమ నౌక వీఎస్ఎస్ యూనిటీ-22లో రోదసిలోకి వెళ్లారు. వర్జిన్ గెలాక్సీ ఈ ఈవెంట్‌ను ఆన్‌లైన్ స్ట్రీమింగ్ చేసింది.
 
నేల నుంచి దాదాపు 88 కి.మీ. ఎత్తుకు చేరుకున్నాక, నాలుగైదు నిమిషాలపాటు వ్యోమగాములు భారరహిత స్థితికి లోనయ్యారు. ఆ సమయంలో యూనిటీ-22 కిటికీల గుండా బయట పరిస్థితులను వారు వీక్షించారు. జీవితాంతం గుర్తుపెట్టుకోగలిగే తీపి అనుభూతులను ఈ తత్రను తనకు ఇచ్చిందని రిచర్డ్ బ్రాన్సన్‌ చెప్పారు. 'ఈ విశ్వం అత్యద్భుతమైనది. అంతరిక్షం అసాధారణమైనది. ప్రజలు ఎందుకు అంతరిక్షంలోకి ప్రయాణించకూడదు? ప్రజలు అంతరిక్షంలోకి వెళ్లి అక్కడి నుంచి అందమైన భూమిని చూడగలిగి తిరిగి భూమిని చేరుకోవాలి' అని చెప్పారు. 
 
రిచర్డ్ బ్రాన్సన్ తన ఈ కలల ప్రాజెక్టును ఇంతవరకు తీసుకురావడం వెనుక ఎంతో కృషి ఉంది. స్పేస్ ప్లేన్ తయారుచేయాలన్న తన కోరికను ఆయన 2004లో బయట ప్రపంచానికి వెల్లడించారు. 2007 నాటికి వాణిజ్యపరమైన స్పేస్ సర్వీసెస్ అందించాలని ఆయన ఆశించారు. కానీ, సాంకేతిక అవరోధాల కారణంగా అది అనుకున్న సమయానికి సాధ్యపడలేదు. 2014లో ఆయన ప్రయత్నం విఫలమైన స్పేస్ ఫ్లైట్ కూలిపోయిందని గుర్తు చేసుకున్నారు.