తియాన్హే బాహ్యంగా చైనా వ్యోమగాముల 7 గంటల స్పేస్ వాక్
చైనా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రోదసీలో సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని ఈ అరుదైన రికార్డును నెలకొల్పింది. పైగా, ఆ దేశ వ్యోమగాములు ఇద్దరు తొలిసారి తమ అంతరిక్ష కేంద్రం తియాన్హే నుంచి బయటకు వచ్చి స్పేస్‌వాక్ చేశారు.
అనంతరం అంతరిక్ష కేంద్రానికి కెమెరాలు, ఇతర పరికరాలను అమర్చారు. అంతరిక్ష కేంద్రంలో మొత్తం ముగ్గురు వ్యోమగాములు ఉండగా, వారిలో లియు బోమింగ్, టాంగ్ హోంగ్‌లు స్పేస్‌వాక్ చేశారు. దాదాపు 7 గంటలపాటు వీరు అంతరిక్ష కేంద్రం బయటే గడిపారు. జూన్ 17న అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న ఈ వ్యోమగాములు మూడు నెలలుగా అక్కడే ఉంటున్నారు.
కాగా, ఏప్రిల్ 29న చైనా తన అంతరిక్ష కేంద్రానికి చెందిన తొలి మాడ్యూల్‌ను రోదసీలోకి పంపింది. వచ్చే ఏడాది చివరి నాటికి అంతరిక్ష కేంద్రాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని చైనా యోచిస్తోంది. ఇందుకోసం ఏకంగా 11 రాకెట్లను ప్రయోగించనుంది. పూర్తిస్థాయిలో సిద్ధమైన తర్వాత తియాన్హే అంతరిక్ష కేంద్రం బరువు 70 టన్నులు ఉంటుంది.