గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (16:11 IST)

సరిహద్దుల్లో చైనా బుల్లెట్ రైలు : భారత్ ఏం చేస్తుందో?

డ్రాగన్ కంట్రీ చైనా సరిహద్దుల్లో బుల్లెట్ రైలును ప్రారంభించింది. సరిహద్దుల్లో ఇప్పటికే బలగాలను మోహరిస్తూ దుందుడుకుగా వ్యవహరిస్తున్న చైనా.. ఇప్పుడు చైనా ఇండో సరిహద్దుల వెంబడి ఈ బుల్లెట్ రైలును నడిపి మరింత రెచ్చగొట్టే చర్యలకు శ్రీకారం చుట్టింది. 
 
అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత సమీపంలో ఉండే టిబెట్‌లోని లాసా - న్యింగ్చి ప్రావిన్సులకు శుక్రవారం ఈ బుల్లెట్ రైలును ప్రారంభించింది. జులై ఒకటో తేదీన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సిచువాన్ - టిబెట్ రైల్వేలో భాగమైన 433.5 కిలోమీటర్ల లాసా - న్యింగ్చి సెక్షన్‌ను ప్రారంభించింది.
 
ఇది పూర్తిగా విద్యుత్‌తో నడిచే రైలు అని షిన్హువా వార్తా సంస్థ ప్రకటించింది. ఇప్పటికే టిబెట్లో ఖింగాయ్ - టిబెట్ రైల్వే లైన్‌ను ప్రారంభించిన చైనా.. తాజాగా సరిహద్దుల్లో అత్యంత కీలకమైన అరుణాచల్ ప్రదేశ్‌కు అతి సమీపంలో సిచువాన్ - టిబెట్ రైల్వే మార్గాన్ని నిర్వహణలోకి తెచ్చింది. సరిహద్దు స్థిరత్వానికి దోహదం చేసే ఈ రైల్వే లైన్‌ను వేగంగా పూర్తి చేయాలని గత ఏడాది నవంబర్‌లోనే చైనా ఆదేశించింది. 
 
చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ రాజధాని అయిన చెంగ్డూలో ప్రయాణం మొదలుపెట్టే ఈ రైలు.. యాన్, టిబెట్ లోని ఖామ్డో మీదుగా లాసాకు చేరుకుంటుంది. ఈ రైలుతో చెంగ్డూ నుంచి లాసా - న్యింగ్చికి 48 గంటల ప్రయాణం కాస్తా 13 గంటలకు తగ్గనుంది.