ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 21 మార్చి 2020 (14:41 IST)

డచ్ విమానం ల్యాండింగ్‌‌కు పర్మిషన్ నో... 90 మంది ఇండియన్స్ వెనక్కి

కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమాణి యూరప్ వంటి దేశాల నుంచి వచ్చే విమానాలపై భారత విమానయాన శాఖ నిషేధం విధించింది. ఇలాంటి విమానాల్లో కరోనా వైరస్ బారినపడినవారు ఎక్కువగా వస్తున్నారు. దీంతో ఇలాంటి విమానాలపై నిషేధం విధించారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది.
 
ఈ పరిస్థితుల్లో తాజాగా ఆమ్‌స్టర్‌డ్యామ్ నుంచి ఢిల్లీకి కొంతమంది ప్రయాణికులతో ఒక విమానం వచ్చింది. ఈ విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయంలో ల్యాండ్ కావాల్సివుంది. కానీ, కేఎల్‌ఎమ్‌ రాయల్‌ డచ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి ల్యాండ్‌ అయ్యేందుకు డీజీసీఏ అనుమతి ఇవ్వలేదు. 
 
ఆమ్‌స్టర్‌డ్యామ్‌ నుంచి బయల్దేరిన కేఎల్‌0871 విమానంలో 90 మంది భారతీయులు ఉన్నారు. కేఎల్‌0871 విమానానికి ప్రయాణ అనుమతి లేదని డీజీసీఏ అధికారులు తెలిపారు. యూరోపియన్‌ యూనియన్‌ దేశాల నుంచి వచ్చే విమానాలపై మార్చి 18వ తేదీ నుంచి భారత విమానయాన శాఖ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 
 
అయితే ఈ నిబంధనలను కేఎల్‌ఎమ్‌ విమానం ఉల్లంఘించిన నేపథ్యంలోనే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయ్యేందుకు అనుమతించలేదు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని అంతర్జాతీయ టెర్మినల్‌ను రేపటి నుంచి మూసివేయనున్నారు. 29వ తేదీ వరకు ఈ నిబంధన అమల్లో ఉండనుంది. 
 
ఇటలీ, స్పెయిన్‌తో పాటు ఇతర దేశాల్లో కరోనా వైరస్‌ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో.. అక్కడ నుంచి వచ్చే విమానాలపై భారత్‌ నిషేధం విధించింది. ఇటలీలో కరోనా మరణాల సంఖ్య 3,407కు చేరింది.