మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 2 సెప్టెంబరు 2019 (11:49 IST)

పాకిస్థాన్‌లో హిందూ యువతి కిడ్నాప్...

ఇటీవలి కాలంలో పాకిస్థాన్ దేశంలో హిందువులపై దాడులు, దురాగతాలు పెరిగిపోతున్నాయి. లాహోర్‌లో ఓ సిక్కు యువతిని అపహరించిన కొందరు యువకులు ఆమెను ఇస్లాంలోకి మార్చి ముస్లిం యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ వివాదం ఇంకా సమసిపోకముందే మరో ఘటన వెలుగుచూసింది. 
 
సింధు ప్రావిన్స్‌లోని ఓ హిందూ యువతిని అపహరించిన కొందరు యువకులు ఆమెను ఇస్లాం మతంలోకి మార్చి ముస్లిం యువకుడితో వివాహం జరిపించారు. బాధిత యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
 
స్థానికంగా బీబీఏ చదువుతున్న తన కుమార్తె గత నెల 29న కాలేజీకి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆ యువతి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగు చూసింది. 
 
బాధితురాలిని ఆమె క్లాస్‌మేట్ బాబర్ అమన్ తన స్నేహితురాలు మిర్జా దిల్వర్ బేగ్‌తో కలిసి అపహరించినట్టు వెల్లడైంది. మీర్జా దిల్వర్.. పాక్ ప్రధాని ఇమ్రాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) సభ్యురాలని తేలింది.
 
బాధితురాలిని అపహరించిన అనంతరం ఆమెను సియోల్‌కోట్‌లోని బేగ్ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను ఇస్లాంలోకి మార్చి బాబర్‌కు ఇచ్చి వివాహం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాబర్ సోదరుడిని అరెస్టు చేశారు. 
 
బాబర్, బాధిత బాలిక ఆచూకీ లభించలేదు. యువతులను ఎత్తుకెళ్లి మతం మార్చి ముస్లిం యువకులకు ఇచ్చి పెళ్లి చేయడం లాంటి ఘటనలు పాక్‌లో ఇటీవల బాగా పెరిగాయి. తాజా ఘటన వారంలో రెండోది కాగా, రెండు నెలల్లో ఇది మూడోదని పాకిస్థాన్‌కు చెందిన హిందూ ఎన్జీవో "ఆల్ పాకిస్థాన్ హిందూ పంచాయత్" సంస్థ తెలిపింది.