కరోనా వైరస్.. ప్రియురాలిని చంపేసిన ప్రియుడు.. ఎందుకంటే?
కరోనా వైరస్ అంటేనే జనం జడుసుకుంటున్నారు. కరోనాకు దూరంగా వుండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా తనకు కరోనా అంటిందనే అనుమానంతో ఓ యువకుడు తన ప్రియురాలిని హత్య చేశాడు. ఈ ఘటన ఇటలీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిసిలీకి చెందిన లారెనా క్వారెంటా, అంటోనియా డి పేస్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
లారెనా డాక్టర్. ఆంటోనియా మేల్ నర్సుగా పనిచేస్తున్నాడు. ఇద్దరూ ఒకే ఆస్పత్రిలో కరోనా రోగులకు సేవలందిస్తున్నారు. చెలి సేవలను గతవారం కొనియాడాడు ఆంటోనియా. కానీ ఆ తర్వాత స్వల్పంగా అతను అనారోగ్యానికి గురయ్యాడు.
ఇంచుమించు కరోనా లక్షణాలే కనిపించడంతో.. లారెన్ వల్లనే అని అనుమానం పెంచుకున్నాడు. ఆమె ద్వారానే తనకు కరోనా సోకిందని భావించి.. బుధవారం ఇంటిలో నిద్రిస్తున్న లారెన్‌ను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆంటోనియా కూడా మణికట్టు కోసుకుని పోలీసులకు ఫోన్ చేశాడు.
పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. బాగా రక్తం పోవడంతో అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కాగా.. లారెన్, ఆంటోనియాల్లో ఎవరికీ కరోనా లేని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారు.