శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 నవంబరు 2020 (17:07 IST)

సోషల్ మీడియాకు చెక్ పెట్టిన ఇమ్రాన్ సర్కార్.. ఆ కంపెనీలు వెళ్లిపోతాయా?

ఇంటర్నెట్, టెక్నాలజీ కంపెనీలు పాకిస్థాన్ నుంచి వదిలివెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వం సెన్సార్ డిజిటల్ కంటెంట్‌ను అమలులోకి తీసుకురావడంతో.. ఇస్లామిక్ దేశంగా పేరొందిన పాకిస్థాన్ భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు అడ్డంకులు పెడుతుందని విమర్శలు మొదలయ్యాయి.
 
ఈ నేపథ్యంలో ఆసియా ఇంటర్నెట్ సముదాయానికి గురువారం హెచ్చరికలు అందాయి. విశ్వవ్యాప్తంగా దిగ్గజాలుగా ఎదిగిన గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లపై ప్రభుత్వ మీడియాకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారాలు ఇచ్చేశారు.
 
దీనిని బట్టి పాకిస్తాన్ ఇంటర్నెట్ కంపెనీలకు వ్యతిరేకంగా కొత్త చట్టాలు తీసుకొస్తుందని తెలుస్తుంది. ఈ రూల్స్‌తో పరిస్థితులు ఎలా ఉంటాయోననే దానిపై చర్చలు నడుస్తున్నాయి. కొత్త రెగ్యులేషన్ ప్రకారం.. సోషల్ మీడియా కంపెనీలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కొత్తగా 3.14మిలియన్ డాలర్ల జరిమానా కట్టాల్సి ఉంది.
 
ఇంటర్నెట్, టెక్నాలజీ దిగ్గజ సంస్థలు ఇస్లామిక్ దేశం పాకిస్థాన్ కొత్తగా ప్రకటించిన నిబంధనలపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వం బుధవారం జారీ చేసిన ఈ నిబంధనలను ప్రజాస్వామికవాదులు కూడా వ్యతిరేకిస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునేందుకే ఈ నిబంధనలను జారీ చేశారని దుయ్యబడుతున్నారు.
 
పాకిస్థాన్ ప్రభుత్వం బుధవారం జారీ చేసిన నిబంధనల ప్రకారం, ప్రభుత్వ అధికారులకు విపరీతమైన అధికారాలు లభించాయి. ఇస్లాంను అవమానించే, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే అంశాలు, విద్వేష ప్రసంగాలు, పోర్నోగ్రఫీ, దేశ భద్రతకు ముప్పుగా పరిగణించే అంశాలను నిరోధించడంలో విఫలమయ్యే సామాజిక మాధ్యమాల కంపెనీలకు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు గరిష్ఠంగా 3.14 మిలియన్ డాలర్లు జరిమానా విధించవచ్చు. 
 
పాకిస్థాన్ డిజిగ్నేటెడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోరిన సమాచారాన్ని సామాజిక మాధ్యమాల కంపెనీలు ఇవ్వాలని ఈ నిబంధనలు పేర్కొంటున్నాయి. డీక్రిప్టెడ్, రీడబుల్, అర్థం చేసుకోదగిన విధంగా ఈ సమాచారాన్ని అందజేయాలి.
 
ట్విటర్, గూగుల్, ఫేస్‌బుక్‌ వంటి సంస్థలతో కూడిన ఆసియా ఇంటర్నెట్ కొయలిషన్ ఈ కొత్త నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నిబంధనల విస్తృత పరిథి పట్ల తీవ్ర భయాందోళన వ్యక్తం చేసింది. ఈ నిబంధనలను పారదర్శకత లేని ప్రభుత్వ ప్రక్రియ ద్వారా రూపొందించడం తమను మరింత ఆందోళనకు గురి చేస్తున్నట్లు తెలిపింది. డేటా లోకలైజేషన్ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని పేర్కొంది. 
 
ఉచిత, స్వేచ్ఛాయుత ఇంటర్నెట్‌ను ఉపయోగించుకునే సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది. పాకిస్థాన్ డిజిటల్ ఎకానమీ మిగిలిన ప్రపంచానికి దూరమవుతుందని పేర్కొంది. పాకిస్థానీ యూజర్లకు సేవలను అందుబాటులో ఉంచేందుకు తన సభ్యులకు కష్టమవుతుందని పేర్కొంది.
 
ఇదిలావుండగా, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. భావ ప్రకటన స్వేచ్ఛకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని చెప్తోంది. పాకిస్థాన్ వ్యతిరేక కంటెంట్‌ను తొలగించడంపై స్పందనలో జాప్యం చేసిన నేపథ్యంలో ఈ కొత్త నిబంధనలను రూపొందించినట్లు తెలిపింది. కొద్ది వారాల క్రితం టిక్ టాక్‌ను ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించిన సంగతి తెలిసిందే.