గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 11 జులై 2024 (11:36 IST)

బ్రిటన్‌లో చరిత్ర సృష్టించిన శివానీ రాజా... భగవద్గీతపై ప్రమాణం!! (Video)

shivani raja
బ్రిటన్ పార్లమెంట్‌‍కు ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మహిళా పారిశ్రామికవేత్త, కన్జర్వేటివ్ పార్టీ నేత శివానీ రాజా చరిత్ర సృష్టించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో లీషెస్టర్ ఈస్ట్ స్థానం నుంచి ఆమె పోటీ చేసి విజయం సాధించారు. దాదాపు 37 ఏళ్ల తర్వాత ఆ నియోజకవర్గంలో కన్జర్వేటివ్ పార్టీని అధికారంలోకి తెచ్చారు. ప్రతపక్ష లేబర్ పార్టీకి చెందిన రాజేశ్ అగర్వాల్‌పై భారీ మెజారిటీతో గెలుపొంది బ్రిటన్ దిగువ సభలో కాలుపెట్టారు.
 
దిగువ సభలో జరిగిన కార్యక్రమంలో శివానీ భగవద్గీతపై ప్రమాణం చేసి తన ఎంపీగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం, ఆమె ఎక్స్ వేదిగా తన సంతోషాన్ని పంచుకున్నారు. భగవద్గీత సాక్షిగా బ్రిటన్ రాజు విశ్వసనీయురాలిగా ఉంటానంటూ ప్రమాణం చేయడం తన జీవితంలో మరిచిపోలేని రోజని ఆమె వ్యాఖ్యానించారు. కాగా, ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి రాజేశ్ అగర్వాల్‌కు 10,100 ఓట్లు రాగా శివానీకి 14,526 ఓట్లు పోలయ్యాయి. ఇటీవల టీ20 మ్యాచ్ సందర్భంగా స్థానిక హిందూ, ముస్లిం మతస్తుల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో శివానీ ఎన్నికకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.
 
కాగా, ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన మొత్తం 27 మంది దిగువ సభకు ఎంపీలుగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా, రికార్డు స్థాయిలో 263 మంది మహిళలు ఎంపీలుగా గెలుపొందారు. ఇక సభలో శ్వేతజాతీయేతర ఎంపీల సంఖ్య కూడా మునుపెన్నడూ లేని విధంగా 90కి చేరింది. బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టిన లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్ దేశాన్ని పునర్నిర్మిస్తానని ప్రతినబూనారు. ఆయన సారథ్యంలోని లేబర్ పార్టీ మొత్తం 650 సీట్లకు గాను 412 సీట్లలో ఘన విజయం సాధించింది. ఇక కన్జర్వేటివ్ పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని మాజీ ప్రధాని రిషి సునాక్ అన్నారు.