ఇండోనేషియాలో అగ్నిపర్వతం పేలిందిలా... (Video)
ఇండోనేషియాలో అగ్నిపర్వతం పేలింది. ఫలితంగా సునామీ సంభవించింది. ఈ రెండు ప్రళయాల కారణంగా ఇప్పటివరకు 220 మంది చనిపోయారు. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. వందలాది మంది గాయపడగా, వేలాది మంది గల్లంతయ్యారు.
ఇండోనేషియాలోని సుమత్రా, జావా దీవుల మధ్య ఉన్న క్రాకటోవా అగ్నిపర్వతం ఒక్కసారి పేలిపోయింది. దీంతో ఈ అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా, బూడిద ఆకాశంలో 500 మీటర్ల మేరకు ఎగిసిపడినట్టు ప్రత్యేక్ష సాక్షులు చెబుతున్నారు. శనివారం రాత్రి 9 గంటల తర్వాత ఇండోనేషియాలోని పండేగ్లాంగ్, సెరాంగ్, దక్షిణ లాంపంగ్ ప్రాంతాల్లో సునామీ వచ్చింది.
ఈ అగ్నిపర్వతం పేలుడుధాటికి సముద్రగర్భంలో భారీగా కొండచరియలు విరిగిపడటంతోనే సునామీ వచ్చినట్లు భౌగోళిక శాస్త్రవేత్తలు, ఇండోనేషియా సునామీ పరిశోధనా కేంద్రం అధికారులు వెల్లడించారు. సునామీ వచ్చినప్పుడు 20 అడుగుల ఎత్తులో అలలు వచ్చాయని చెబుతున్నారు.
ఈ కారణంగానే వందల సంఖ్యలో భవనాలు, ఇళ్లు కూలిపోయాయి. సహాయక చర్యలు కొనసాగిస్తోంది ప్రభుత్వం. పెద్ద ఎత్తున ఎగసిపడిన అలల కారణంగా వందల ఇళ్లు నేలమట్టమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నష్టం ఎంతనేది ఇప్పుడే చెప్పలేమని ఇండోనేషియా ప్రభుత్వం తెలిపింది.