బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 డిశెంబరు 2024 (11:16 IST)

హమాస్ కమాండ్ కంట్రోల్‌ ఆస్పత్రిలో దాడి.. 43 మంది మృతి

deadbody
గాజాలోని హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఉత్తర గాజాలోని హమాస్ చివరి కమాండ్ కంట్రోల్‌గా భావిస్తున్న కమల్ అద్వాన్ ఆస్పత్రిపై ఆదివారం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) భీకర దాడులు జరిపింది. అలాగే, జబాలియా, హోనస్, లాహియా ప్రాంతాల్లోనూ దాడులకు దిగింది. ఈ దాడుల్లో మొత్తంగా 43 మంది మృతి చెందారు. 
 
ఆస్పత్రిపై జరిగిన దాడిలో 20 మంది హమాస్ ఫైటర్లు హతమయ్యారు. అలాగే, వైద్యులు, వైద్య సిబ్బంది సహా 240 మందిని నిర్బందించింది. బందీల్లో ఆసుపత్రి డైరెక్టర్ అబూ సాఫియా కూడా ఉన్నారు. బందీల కళ్లకు గంతలు కట్టి ఆసుపత్రి ప్రాంగణంలో కూర్చోబెట్టడంతోపాటు ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వారిని పెడరెక్కలు విరిచికట్టి అర్ధనగ్నంగా కూర్చోబెట్టిన వీడియోలు, ఫొటోలను స్థానిక మీడియా ప్రచురించింది. 
 
కాగా, హమాస్ అతిపెద్ద కమాండ్ కంట్రోల్ ఈ ఆసుపత్రిలోనే ఉందని, అక్కడి నుంచే ఇజ్రాయెల్‌పై దాడులకు వ్యూహరచన చేస్తున్నట్టు ఇజ్రాయెల్ ఆర్మీ అనుమానిస్తోంది. తాజాగా బందీలుగా పట్టుబడిన వారిలో ఇజ్రాయెల్‌పై అక్టోబరు 7వ తేదీ దాడి చేసిన ఉగ్రవాదులు ఉన్నారని, షకీద్ బెటాలియన్‌కు చెందిన హమాస్ ఫైటర్లు వీరిలో ఎక్కువమంది ఉన్నారని ఐడీఎఫ్ ప్రకటించింది. కాగా, ఆసుపత్రిలోని నిజమైన రోగులను చికిత్స కోసం సురక్షితంగా ఇండోనేషియా ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొంది.