గాజా స్ట్రిప్‌పై దాడులు - ఇజ్రాయేల్ దాడులు... 73 మంది మృతి
గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయేల్ మరోమారు దాడులకు తెగబడింది. తాజాగా నిర్వహించిన దాడుల్లో 73 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. ఈ మేరకు హమాస్ వార్తా సంస్థ వెల్లడించింది. ఉత్తర గాజాలో బీట్ లాహియా పట్టణంలోని భవనాలపై ఇజ్రాయేల్ వైమానిక దాడులు చేసింది. మృతుల్లో అనేక మంది మహిళలు, చిన్నారులే కావడం గమనార్హం. ఈ దాడుల్లో పలువరు తీవ్రంగా గాయపడగా.. మరికొందరి జాడ తెలియరాలేదని అక్కడి అధికారులు వెల్లడించారు.
ఇజ్రాయేల్ దళాలు పౌర స్థావరాలే లక్ష్యంగా దాడులు చేయడంతో పాటు ఆసుపత్రులను ముట్టడించి బాధితులకు అందాల్సిన వైద్యం, ఆహార సామగ్రిని అడ్డుకుంటున్నాయని అక్కడి నివాసితులు, వైద్యాధికారులు ఆరోపించారు. మరోవైపు ఉత్తర గాజాలోని ఆసుపత్రులో వైద్య సామగ్రి, మానవవనరుల కొరత అధికంగా ఉందని గాజా అరోగ్య శాఖ వెల్లడించింది.
ఇటీవల ఇజ్రాయేల్ జరిపిన దాడుల్లో హమాస్ మిలిటెంట్ అధినేత యాహ్యా సిన్వర్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణ గాజాపై ఇజ్రాయేల్ విమానాలతో కరపత్రాలను విసురుతున్నట్లు అక్కడి వార్తా సంస్థలు పేర్కొన్నాయి. ఈ కరపత్రాల్లో సిన్వర్ మృతదేహానికి సంబంధించిన ఫొటోతో పాటు.. 'హమాస్ ఇకపై గాజా పాలించదు, ఆయుధాలను వదిలి బందీలను అప్పగించే వారికి స్వేచ్ఛగా జీవించే అవకాశం కల్పిస్తాం' అనే సందేశాలు ఉన్నట్లు తెలుస్తోంది.