శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (16:23 IST)

ఆఫ్ఘన్‌ను తాలిబన్లు ఎలా ఆక్రమించారు? మంచిరోజులు వచ్చాయంటూ..?

Taliban
ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల రాజ్యానికి అంతా సిద్ధమైంది. ఎప్పుడైతే అమెరికా సేనలు తప్పుకుంటున్నట్టు ప్రకటించాయో అప్పటి నుంచి ఆప్ఘన్ తాలిబన్లు ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. వారాల వ్యవధిలోనే తాలిబన్లు ఆ దేశం మొత్తాన్ని ఆక్రమించుకున్నారు. ఆదివారం రోజున తాలిబన్లు కాబూల్ శివారు ప్రాంతానికి చేరుకోగా, సోమవారం నాడు కాబూల్‌లోకి వచ్చారు. 
 
అధ్యక్ష భవనంలోకి ప్రవేశించిన తరువాత తాలిబన్లు కీలక ప్రకటన చేశారు. యుద్ధం ముగిసిందని, ఆఫ్ఘన్ ప్రజలకు, ముజాహిదీన్‌లకు మంచిరోజులు వచ్చాయని అంతర్జాతీయ మీడియాతో తెలిపారు. శాంతియుతమైన పాలన అందిస్తామని చెప్పిన తాలిబన్ నేతలు, త్వరలోనే అధికారం మార్పిడి జరుగుతుందని, ఏ దేశానికి వ్యతిరేకంగా తమ భూభాగాన్ని వాడుకోబోనివ్వమని తెలిపారు. 
 
శాంతియుతమైన, అభివృద్ది పాలనను అందిస్తామని తాలిబన్ రాజకీయ కార్యాలయ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే, తాలిబన్ల పాలనపై ప్రజలకు నమ్మకం లేదు. 1994 నుంచి 2001 వరకు తాలిబన్ల పాలనలో ప్రజలు ఎంతటి నరకాన్ని అనుభవించారో వారింకా మర్చిపోలేదు. ఇప్పుడు కూడా అదేవిధమైన పాలన చూడాల్సి వస్తుందని ప్రజలు భయపడుతున్నారు.
 
ఆఫ్ఘనిస్థాన్‌లోని 19 రాష్ట్రాలకు సంబంధించిన రాజధానుల్లో పాగా వేసిన తాలిబన్లు.. ఇక. ఆఫ్ఘన్‌పై పూర్తిస్థాయిలో పట్టు సాధించేదిశగా కదిలారు. దేశంలోని అన్ని ప్రధాన న‌గ‌రాల‌ను ఇప్పటికే ఆక్రమించారు తాలిబన్లు. రెండు దశాబ్దాల తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌పై తాలిబన్లు పూర్తిస్థాయిలో మళ్లీ పట్టు సాధించారు. నెల రోజుల్లోనే ప్రభుత్వ బలగాలను ఓడించి యావత్‌ దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 
 
ఆదివారం ఉదయం రాజధాని కాబూల్‌ శివారుల్లోకి ప్రవేశించిన తాలిబన్లు సాయంత్రానికల్లా నగరంలో పాగా వేశారు. దీంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అష్రఫ్‌ ఘనీ.. కుటుంబసభ్యులతో సహా తజికిస్థాన్‌ వెళ్లిపోయినట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. 
 
మరోవైపు, ప్రభుత్వం లొంగిపోవాలని తాలిబన్లు అల్టిమేటం ఇచ్చారు. కాబూల్‌లోని అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధ్యక్ష భవనం నుంచే ఇస్లామిక్‌ ఎమిరేట్‌ ఆఫ్‌ ఆఫ్ఘనిస్థాన్‌ను ప్రకటిస్తామన్నారు. కాబూల్‌ను బలవంతంగా ఆక్రమించే ఉద్దేశం తమకు లేదని, ప్రజలు భయభ్రాంతులు కావద్దని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో శాంతియుత వాతావరణంలో అధికార మార్పిడి జరుగుతుందని వెల్లడించారు.