శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 ఆగస్టు 2021 (11:55 IST)

3 రాజధానులను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. బిగుతుగా దుస్తులు ధరించిందని..?

ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. రక్తపుటేరులు పారిస్తున్నారు. ఆప్ఘన్‌లోని కీలక ప్రాంతాలను తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ఇక సాధారణ పౌరులపై తాలిబన్లు విరుచుకుపడుతున్నారు. ఓ మహిళ బిగుతైన దుస్తులు ధరించిందని.. ఆమెను తాలిబన్లు అత్యంత దారుణంగా చంపేశారు. మహిళలు పని కోసం బయటకు వెళ్లకూడదని తాలిబన్లు నిషేధం విధించారు. 
 
ఈ క్రమంలో ఆ మహిళ పని నిమిత్తం బుర్ఖా ధరించి వాహనం ఎక్కబోతుండగా తాలిబన్లు దాడి చేసి చంపారు. మృతురాలని 21 ఏండ్ల నజానిన్‌గా పోలీసులు గుర్తించారు. అయితే ఆమెను తాము చంపలేదని తాలిబన్లు ప్రకటించారు. పోలీసులు తమపై కావాలని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
 
ఇకపోతే.. ఒక్కరోజులో ఆప్ఘనిస్థాన్‌లోని మరో మూడు ప్రావిన్స్‌ల రాజధానులను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. తిరుగుబాటుదారులు శుక్రవారం నుంచి చేస్తున్న దాడుల్లో ఐదు ప్రావిన్సుల రాజధానులను ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు స్థానిక అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సర్‌-ఇ-పుల్‌ నగరంలోని అన్ని ప్రభుత్వ భవనాలను, అక్కడ ఉన్న అన్ని కార్యాలయాలను తమ నియంత్రణలో ఉన్నాయని తాలిబన్లు పేర్కొన్నారు. 
 
అధిక శాతం గ్రామీణ ప్రాంతాలను ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు ఇప్పుడు పట్టణ ప్రాంతాలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఆదివారం దేశ ఉత్తర ప్రాంతంలోని కుందుజ్‌, సర్‌-ఇ-పుల్‌, టాల్కోన్‌ నగరాలను గంటల్లోనే తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు తాలిబన్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 14 మఅతదేహాలతో పాటు గాయపడిన 30 మందిని ఆసుపత్రులకు తరలించినట్లు కుందుజ్‌ ఆరోగ్య అధికారులు వెల్లడించారు.