విమానం ఇంజిన్‌లో పడి వ్యక్తి మృతి
అనుమానాస్పద స్థితిలో విమానం ఇంజిన్‌లో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్ విమానాశ్రయంలో చోటుచేసుకొంది. డెన్మార్క్‌కు ప్రయాణించేందుకు కేఎల్ 1341 విమానం పుష్‌బ్యాక్ అవుతున్న సమయంలో అక్కడే ఉన్న వ్యక్తిని ఒక్కసారిగా ఇంజిన్ లోపలికి లాక్కొంది. అత్యంత వేగంగా తిరుగుతున్న బ్లేడ్లలో చిక్కుకొని అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు ఎయిర్ పోర్టు సిబ్బందా.. లేకా బయట వ్యక్తా? అనే విషయం ఇప్పటి వరకు తెలియలేదు.
వెంటనే ఘటనా స్థలానికి నెదర్లాండ్స్ మిలటరీ పోలీసులు చేరుకొన్నారు. ప్రమాదవశాత్తు అతడు అందులో పడ్డాడా.. ఓ రకంగా ఆత్మహత్య చేసుకొన్నాడా అనేది కూడా తేలాల్సి ఉందని వారు వెల్లడించారు. ప్రమాదం సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బందిని దింపేసి వారికి మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పిస్తామని ఎయిర్‌లైన్స్ పేర్కొంది.
డచ్ మీడియా సంస్థలు మాత్రం చనిపోయిన వ్యక్తి విమానయాన సంస్థ ఉద్యోగి అయి ఉంటాడని కథనాలు రాసుకొచ్చాయి. ప్రమాద సమయంలో అతడు విమానం పుష్‌బ్యాక్ పనిలో నిమగ్నమై ఉండొచ్చని పేర్కొన్నాయి. ఎయిర్ పోర్టుల్లో విమానం ఇంజిన్ సమీపంలోని వారిని లోపలికి లాగేసుకొనే ఘటనలు చాలా అరుదుగా చోటు చేసుకొంటాయి. గతేడాది కూడా అమెరికాలోని టెక్సాస్ శాన్‌ఆంటోనియో ఎయిర్ పోర్టులో ఓ ఉద్యోగిని ఇలానే విమానం ఇంజిన్ లాగేసుకొంది. ఆ ఘటనలో అతడు ప్రాణాలు కోల్పోయాడు.