మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 నవంబరు 2020 (09:38 IST)

గౌరవంగా తప్పుకుంటారా? లేదా విడాకులు ఇవ్వమంటారా? మెలానియా వార్నింగ్???

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు ఆయన భార్య, అమెరికా ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు వార్తాకథనాలు వస్తున్నాయి. అమెరికా శ్వేతసౌథం అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఎలక్టోరల్ ఓట్ల మేరకు ఓటమిపాలయ్యారు. తన ప్రత్యర్థి జో బైడెన్ విజయభేరీ మోగించారు. 
 
అయితే, ఈ ఓటమిని ట్రంప్ అంగీకరించడం లేదు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇదే అంశంపై న్యాయపోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నారు. పైగా, అధికార భవనం వైట్‌హౌస్‌ను వీడేందుకు సైతం ఆయన ససేమిరా అంటున్నట్టు సమాచారం. 
 
ఈ పరిణామలన్నింటిని దగ్గరుండి నిశితంగా పరిశీలించిన మెలానియా... ఓటమిని అంగీకరించి, గౌరవంగా పదవి నుంచి వైదొలగాలని సూచించినట్టు వార్తలు వస్తున్నాయి. ఓటమిని అంగీకరించేందుకు సిద్ధంగా లేని తన భర్త మనసును మార్చాలని ఆమె ప్రయత్నిస్తున్నట్టు సీఎన్ఎన్ ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రచురించింది. ఇప్పటికే ట్రంప్ ప్రధాన అనుచరులతో మెలానియా మాట్లాడారని, ఈ మేరకు ట్రంప్‌కు నచ్చజెప్పి ఓటమిని అంగీకరించేలా చూడాలని కోరుతున్నారని మెలానియా సన్నిహిత వర్గాలు వెల్లడించినట్టు వార్తా సంస్థ పేర్కొంది.
 
అయితే, ఇప్పటివరకూ తన భర్త ఓటమిపై మెలానియా ఇంతవరకూ స్పందించలేదు. ఆమె విడాకులు కోరుకుంటున్నారని, ట్రంప్ వైట్‌హౌస్ నుంచి బయటకు రాగానే ఆయన్నుండి విడిపోతారని వార్తలు వస్తున్నాయి. మెలానియా అభిప్రాయం మేరకు, ట్రంప్ ఇప్పటికే ఓటమి పాలయ్యారని, ఈ విషయాన్ని అంగీకరిస్తున్న ఆమె, తన భర్త కూడా నిజాన్ని హుందాగా అంగీకరించాలని కోరుతున్నారని సీఎన్ఎన్ పేర్కొంది.