బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 9 నవంబరు 2020 (08:24 IST)

మాజీగా మారనున్న డోనాల్డ్ ట్రంప్‌కు ఎలాంటి సౌకర్యాలో తెలుసా?

ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓటమిపాలయ్యారు. దీంతో జనవరి 15వ తేదీ తర్వాత ఆయన మాజీగా మారనున్నారు. అయితే, మాజీ అధ్యక్షుడైన తర్వాత డోనాల్డ్ ట్రంప్‌కు సర్వసౌకర్యాలను వైట్‌హౌస్ కల్పించనుంది. అవన్నీ కూడా ఉచితమే. 
 
అమెరికాలో మాజీ అధ్యక్షులకు ఖర్చుల కోసం పెద్దమొత్తంలో పెన్షన్ ఇస్తారు. దీంతో డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ భారీగా పెన్షన్ లభించనుంది. అంతేకాదు, కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తారు. అనేక సదుపాయాలను ఆయన ఉచితంగానే పొందవచ్చు. 
 
1958 ఫార్మర్ ప్రెసిడెంట్ యాక్ట్ (ఎఫ్ పీఏ) ప్రకారం ఏటా రూ.1.6 కోట్లు పెన్షన్ అందుకోనున్నారు. మాజీ అధ్యక్షుడి భార్యకు కూడా ఏటా పెన్షన్ ఇస్తారు. ఆ పెన్షన్ 20 వేల డాలర్ల వరకు ఉంటుంది. 
 
అంతేకాదు, మాజీ అధ్యక్షుడు తన కార్యకలాపాల కోసం ఆఫీసు ఏర్పాటు చేసుకోదలిస్తే అందుకు ప్రభుత్వమే నిధులు సమకూరుస్తుంది. ఇంటి అద్దెలు, టెలిఫోన్, విద్యుత్, ఇంటర్నెట్ బిల్లులన్నీ ప్రభుత్వ ఖాతాలోకే పోతాయి.
 
మాజీలకు వైద్యం కూడా ఉచితమే. దేశాధ్యక్షుడితో పాటే మాజీ అధ్యక్షులకు కూడా అత్యున్నత సౌకర్యాలు ఉండే సైనిక ఆసుపత్రుల్లోనే వైద్యం అందిస్తారు. ముఖ్యంగా, అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచ వ్యవహారాలకు సంబంధించి అనేక కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కారణంగా శత్రువులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే అధ్యక్షులు పదవి నుంచి తప్పుకున్నా వారికి భారీగా భద్రత ఏర్పాట్లు కల్పిస్తారు.
 
1996లో తీసుకువచ్చిన చట్టం ప్రకారం జీవితకాలం భద్రత కల్పించాలని నిర్ణయించినా, ఆ మరుసటి ఏడాది చేసిన సవరణలో పదేళ్లు చాలని పేర్కొన్నారు. కానీ బరాక్ ఒబామా వచ్చాక దాన్ని పునరుద్ధరించారు. అమెరికా మాజీ అధ్యక్షులకు జీవితకాలం రక్షణ కల్పించాలంటూ ఒబామా కీలక నిర్ణయం తీసుకున్నారు.