శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 నవంబరు 2020 (13:17 IST)

'చింత చచ్చినా పులుపు చావలేద'న్నట్టుగా.. ఓటమిని అంగీకరించని ట్రంప్!

తెలుగులో ఓ సామెత ఉంది. చింత చచ్చినా పులుపు చావలేదు అన్నది ఈ సామెత. ఇపుడు ఇది అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఎందుకంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆయన స్థానాన్ని డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కైవసం చేసుకున్నారు. కానీ, డోనాల్డ్ ట్రంప్ మాత్రం తన ఓటమిని అంగీకరించడం లేదు. ఏడు కోట్ల పై చిలుకు లీగల్ ఓట్లు వచ్చిన నేను ఎలా ఓడిపోతానంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
ఆదివారం మధ్యాహ్నం వరకు వెల్లడైన ఫలితాల మేరకు జో బైడెన్ ఖాతాలో 290 ఎలక్టోరల్ ఉండగా ట్రంప్ ఖాతాలో 214 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అంటే, విజయానికి అవసరమైంది 270 ఓట్లు మాత్రమే. బైడెన్ ఖాతాలో అంతకంటే ఎక్కువగానే ఉన్నాయి. అంటే 290 ఎలక్టోరల్ ఓట్లతో డెమొక్రటిక్ పార్టీకి చెందిన జో బైడెన్ అమెరికా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. 
 
జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయితే, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో తానే గెలిచానని తాజాగా ట్వీట్ చేశారు. 'కౌంటింగ్ గదిలోకి మా అబ్జర్వర్లను అనుమతించలేదు. ఇప్పటివరకు ఎప్పుడూ ఇలా జరగలేదు. నాకు 7 కోట్ల 10 లక్షల లీగల్ ఓట్లు వచ్చాయి. అమెరికా చరిత్రలో సిట్టింగ్ ప్రెసిడెంట్‌కు ఇన్ని ఓట్లు రావడం ఇదే తొలిసారి. నేనే గెలిచా' అని ఆయన చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
కాగా, ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ఆధారంగా ట్రంప్‌ 214 ఎలక్టోలర్ ఓట్ల వద్దే ఆగిపోయారు. ప్రస్తుతం నార్త్ కరోలినాలో మాత్రమే ఆయన ఆధిక్యంలో ఉన్నారు. ఇక బైడెన్ గెలిచినట్లు ప్రకటన వెలువడిన అనంతరం స్పందించిన ట్రంప్ మీడియా ఛానెల్స్ ప్రకటించినంత మాత్రానా బైడెన్ గెలిచినట్లు కాదంటున్నారు. 
 
'ఈ ఎన్నికలు చాలా దూరంగా ఉన్నాయి. జో బైడెన్ విజయం సాధించినట్లు ఇంత వరకు ఏ రాష్ట్రం కూడా ధృవీకరించలేదు. మా బృందం సోమవారం నుంచి న్యాయపోరాటాన్ని ప్రారంభిస్తుంది' అంటూ ట్రంప్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.