సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 నవంబరు 2020 (12:41 IST)

అమెరికా కొత్త అధినేతలకు మోడీ - చంద్రబాబు శుభాకాంక్షలు

అమెరికా దేశ కొత్త అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్న జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడులు శుభాకాక్షలు తెలిపారు. బైడెన్ విజయంతో భారత్, అమెరికా మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆకాంక్షిస్తున్నట్టు మోడీ ఈ మేరకు చేసిన ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
గతంలో ఆయనతో కలిసి పనిచేసిన సందర్భాన్ని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, మీతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు మోడీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
అలాగే, అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్‌కు కూడా మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల సమయంలో హారిస్ ఉపయోగించిన తమిళ 'చిట్టీస్' పదాన్ని ప్రధాని ఈ సందర్బంగా ఉపయోగిస్తూ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. 
 
ఎన్నికల్లో మీరు సాధించిన ఘనత ఒక్క 'చిట్టీస్'కే పరిమితం కాదని, ఇండియన్ అమెరికన్లు అందరికీ గర్వకారణమని పేర్కొన్న ప్రధాని.. ఆమె నాయకత్వం, సహకారంతో భారత్, అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కూడా జో బైడెన్, కమలా హారిస్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.