శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2023 (18:09 IST)

కలవరపెడుతున్న కొత్త వేరియంట్లు - ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

pneumonia after corona
కరోనా వైరస్ ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపేసింది. గత 2019లో వెలుగు చూసిన ఈ మహమ్మారి అనేక లక్షల మందిని బలితీసుకుంది. రెండేళ్ల పాటు భయపెట్టిన ఈ వైరస్ వ్యాప్తి, తీవ్రత తగ్గుముఖం పట్టింది. అయితే, కొత్త వేరియంట్లు మాత్రం కలవరపెడుతున్నాయి. తాజాగా అమెరికాలో కొవిడ్‌ 19కి చెందిన కొత్త రకాన్ని గుర్తించారు. ఈ వేరియంట్‌ను బీఏ.2.86గా పేర్కొన్నారు. దీనిని అమెరికాతోపాటు డెన్మార్క్‌, ఇజ్రాయెల్‌లోనూ కనుగొన్నారు. 
 
దీంతో అప్రమత్తమైన అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం (సీడీసీ).. దీన్ని ట్రాక్‌ చేసే పనిలో నిమగ్నమైంది. ఈ రకానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నామని.. కరోనా నుంచి రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఎటువంటి మార్పు లేదని తెలిపింది. ఈ బీఏ.2.86 కొత్త రకానికి సంబంధించి అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించింది. 
 
ఇందులో భారీ సంఖ్యలో ఉత్పరివర్తనాలు చోటుచేసుకుంటున్నందున.. ప్రస్తుతం దీన్ని 'వేరియంట్‌ అండర్‌ మానీటరింగ్‌'గా పేర్కొన్నామని తెలిపింది. ఈ రకానికి చెందిన సీక్వెన్స్‌లు కొన్ని దేశాల్లోనే వెలుగు చూశాయని.. ప్రస్తుతం మూడు వేరియంట్‌ ఆఫ్‌ ఇంటెరెస్ట్‌లతోపాటు ఏడు వేరియంట్స్‌ అండర్‌ మానిటరింగ్‌లను ట్రాకింగ్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్‌ వ్యాప్తి, తీవ్రతను అర్థం చేసుకునేందుకు మరింత సమాచారం అవసరమని.. దీనిపై ప్రపంచ దేశాలతో ఎప్పటికప్పుడు సమాచారం పంచుకుంటున్నట్లు తెలిపింది.
 
కొవిడ్‌-19 ఆరోగ్య అత్యయికస్థితి కాకున్నా ప్రపంచానికి ఇదొక ముప్పేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ ఘెబ్రెయేసస్‌ పేర్కొన్నారు. ఇక కొత్తగా గుర్తించిన బీఏ.2.86 వేరియంట్‌ను ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నామన్నారు. గుజరాత్‌లో జరుగుతోన్న జీ20 ఆరోగ్య మంత్రుల సమావేశంలో పాల్గొన్న టెడ్రోస్‌.. ప్రారంభోపన్యాసం చేశారు.