బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2022 (08:21 IST)

భారత్‌లోకి ప్రవేశించిన కరోనా బీఎఫ్-7 వైరస్ - కేంద్రం అలెర్ట్

bf7 variant
చైనాలో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తుంది. గత వారం పది రోజులుగా కరోనా వైరస్ వ్యాప్తి తారా స్థాయికి చేరుకుంది. దీంతో కరోనా వైరస్ బారినపడినవారికి చికిత్సలు చేయలేక చైనా వైద్యులు చేతులెత్తేశారు. రోగులను ఆస్పత్రుల్లో నేలపై పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారు. చైనా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మృత్యుఘంటికలు మోగిస్తుంది. దీనికి చైనా వ్యాప్తంగా వ్యాపించిన బీఎఫ్-7 వేరియంట్ వైరస్‌గా గుర్తించారు. ఇపుడు ఈ వైరస్ భారత్‌లోకి ప్రవేశం చేసింది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. 
 
నిజానికి ఈ వేరియంట్ తొలి కేసు గత అక్టోబరులోనే నమోదైంది. అప్పటి నుంచి ఈ వైరస్ కేసుల్లో పెరుగుదల కనిపించలేదు. ఇపుడు మరోమారు ఈ వైరస్ ప్రవేశించండంతో కేంద్రం అప్రమత్తమైంది. తాజాగా వెలుగు చూసిన రెండు కేసుల్లో ఒకటి గుజరాత్‌లోనూ, మరొకటి ఒరిస్సా రాష్ట్రంలో బయటపడింది. ఈ కేసులను గుజరాత్ బయోటెక్నాలజీ సెంటర్ గుర్తించింది. 
 
దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల ఏమీ లేదని, అయితే, కొత్త వేరియంట్లపై నిఘా ఉంచాలని నిర్ధేశించారు. కాగా, పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తం అయింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చరికలు జారీచేసింది. అలాగే, దేశంలో కరోనా పరిస్థితులపై ప్రతివారం సమీక్షా సమావేశం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఒమిక్రాన్ బీఎఫ్-7 వేరియంట్‌కు రీ ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం ఉందని కేంద్రం తెలిపింది 
 
కాగా, అమెరికా, బ్రిటన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్ దేశాల్లో బీఎఫ్-7 కేసులు ఉన్నట్టు వివరించింది. ఇకపై విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఎయిర్ పోర్టుల్లో నేటి నుంచి శాంపిల్స్ సేకరణ నిబంధన అమల్లోకిరానుంది.