శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2022 (11:55 IST)

ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక స్థలం తాజ్‌ మహల్‌కు ఇంటి పన్ను నోటీసు

taj mahal
ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక స్థలంగా పేరుగాంచిన తాజ్ మహల్‌కు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అగ్రా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇంటిపన్ను నోటీసు జారీచేశారు. ఈ మేరకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు నోటీసులు పంపించారు. తాజ్‌ మహాల్‌పై బకాయి ఉన్న రూ.1.40 లక్షల ఇంటిపన్నును తక్షణం చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. పైగా, ఈ బకాయిలు చెల్లించడానికి పురావస్తు శాఖ అధికారులకు 15 రోజుల గడువు కూడా ఇచ్చారు. 
 
నిర్ణీత గడువులోగా బకాయిపడిన పన్నును చెల్లించకుంటే తాజ్‌ మహాల్‌ను అటాచ్ చేస్తామని అందులో పేర్కొన్నారు. ఇంటి పన్ను మొత్తంలో బకాయిపై వడ్డీగా రూ.47 వేలను కూడా చేర్చారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఇంటి పన్ను కింద తాజ్‌ మహాల్‌కు రూ.11.098గా చెల్లించాలని పేర్కొన్నారు. 
 
ఈ నోటీసును అందుకున్న పురావస్తు శాఖ అధికారులు షాక్‌కు గురయ్యారు. బ్రిటీష్ కాలంలోనే తమకు ఇంటిపన్ను నోటీసును పంపించలేదని వారు గుర్తుచేశారు. తాజా మహాల్‌ను రక్షిత స్మారక చిహ్నంగా ప్రకటించారని, అందుకే ఈ పన్నును విధించారేమోనని పురావస్తు శాఖ అధికారులు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
కాగా, ఈ నోటీసులపై ఆగ్రా మున్సిపల్ అధికారులు స్పందిస్తూ, పొరపాటుగా ఈ నోటీసులు పంపించి ఉండొచ్చని అధికారులు తెలిపారు. ఆగ్రా మున్సిపల్ అధికారులు మాత్రం ఓ ప్రైవేటు సంస్థకు ఈ బాధ్యతలను అప్పగించామని, అక్కడ ఏదో పొరపాటు జరిగివుండొచ్చని తెలిపారు.