మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2022 (22:31 IST)

ఎలాన్ మస్క్: ట్విటర్ బాస్‌గా దిగిపోవాల్సిందేనంటూ యూజర్ల ఓటు - ఇప్పుడు పరిస్థితేంటో?

elon musk
ట్విటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఎలాన్ మస్క్ దిగిపోయేందుకు మద్దతు తెలుపుతూ ఈ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ యూజర్లు ఓటేశారు. కొద్ది సేపటి క్రితమే బిలీనియర్ పోస్టు చేసిన పోల్ గడువు ముగిసింది. ట్విటర్ హెడ్‌గా తాను తప్పుకోవాలా..? ఓటింగ్ ఫలితాలకు తాను కచ్చితంగా కట్టుబడి ఉంటానని చెబుతూ ఒక పోల్‌ను ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ పోల్‌ ద్వారా ట్విటర్‌లో తన భవిష్యత్‌పై 12.2 కోట్ల మంది ఫాలోయర్స్ అభిప్రాయాన్ని ఎలన్ మస్క్ కోరారు.

 
ఆ పోల్‌కు ట్విటర్ బాస్‌గా ఎలాన్ మస్క్ తప్పుకోవాలని తెలుపుతూ.. 57.7 శాతం మంది ‘యెస్’ అని ఓటేయగా.. 42.5 శాతం మంది మాత్రం మస్క్ దిగిపోవద్దంటూ కోరారు. సోమవారంతో ముగిసిన ఈ పోల్‌లో 1.75 కోట్ల మంది ఫాలోయర్స్ పాలుపంచుకున్నారు. ప్రస్తుతం పోల్ ముగియడంతో.. దీనిపై ఎలాన్ మస్క్ స్పందించాల్సి ఉంది. ఒకవేళ ఎలన్ మస్క్ ట్విటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా దిగిపోయినప్పటికీ, ట్విటర్ ఓనర్‌గా కొనసాగనున్నారు.

 
టెస్లా, స్పేస్‌ఎక్స్ కంపెనీలను నడిపే ఈ టెక్నాలజీ టైకూన్ ఇటీవలే మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విటర్‌ను కొనుగోలు చేశారు. ఈ  కంపెనీని కొనుగోలు చేసినప్పటి నుంచి ఎలాన్ మస్క్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. న్యాయ వివాదం తర్వాత, ఎలాన్ మస్క్ ఈ ఏడాది అక్టోబర్ నెలలో 44 బిలియన్ డాలర్ల కొనుగోలు ఒప్పందంతో ట్విటర్‌ను పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. గతంలో కూడా పలు పోల్స్‌ని చేపట్టిన ఎలాన్ మస్క్, వాటికి కట్టుబడి ఉన్నారు. "vox populi, vox dei" అనే లాటిన్ వాక్యాన్ని ఆయన ఎక్కువగా నమ్ముతారు. ఈ వాక్యం అర్థం ఏమిటంటే, ‘‘ప్రజల గొంతుకే, దేవుడి స్వరం’’ అని.

 
తనని తాను అసమర్థ మూర్ఖుడిగా చూపించుకుంటున్నారని, మనకందరికీ ఇది తెలుసని ఇటీవలే కంపెనీ నుంచి వైదొలిగిన ఒక ట్విటర్ మాజీ ఉద్యోగి బీబీసీకి చెప్పారు. ఆయన ఇన్వెస్టర్లు కచ్చితంగా దీన్ని చూసుంటారని, మస్క్‌ని వారు నిలదీసుంటారని తాను భావిస్తున్నట్టు తెలిపారు. ‘ట్విటర్ చీఫ్‌గా దిగిపోవాలని ఆయనపై ఇన్వెస్టర్ల నుంచి ఒత్తిడి పెరిగిందని నేను భావిస్తున్నా. ఆయన బిల్లులు చెల్లిస్తున్న వారి కోరిక మేరకు కాకుండా.. ప్రజల అభిప్రాయాన్ని తాను గౌరవిస్తున్నట్టు చూపించుకునేందుకు ఈ పోల్‌ను ఆయన ఉపయోగించుకున్నారు’’ అని అన్నారు.

 
పోల్ ముగియడానికి ముందు, క్రిప్టో ఎక్స్చేంజ్ బినాన్స్ వ్యవస్థాపకుడు కూడా దీనికి సమాధానం ఇచ్చారు. ఎవరేమనుకున్నా, ఎంత కష్టమైనా తాను ఆ పదవిలో ఉండాలని, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా తాను దిగిపోవద్దని కోరుతూ బినాన్స్ ఫౌండర్ ఛాంగ్‌పెంగ్ జావో ట్వీట్ చేశారు. ట్విటర్ ఇన్వెస్టర్లలో ఛాంగ్‌పెంగ్ జావో ఒకరు. ఎలన్ మస్క్ ట్విటర్ టేకోవర్‌కి ఆయన మద్దతిచ్చారు. ట్విటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఎలాన్ మస్క్ పాలన ముగిసేందుకు ఈ పోల్ దారితీస్తుందని తాను నమ్ముతున్నట్టు ఈ పోల్ క్లోజ్ కావడానికి కాస్త ముందు వెడ్‌బుష్ సెక్యూరిటీస్ సీనియర్ ఈక్విటీ అనలిస్టు డ్యాన్ ఈవ్స్ బీబీసీకి చెప్పారు.

 
అక్టోబర్‌ నెలలో ఈ సోషల్ మీడియా సైటును ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత ట్విటర్‌లో ఎన్నో వివాదస్పదమైన మార్పులు వచ్చాయి. ఈ మార్పుల వల్ల ఎలన్ మస్క్ తీవ్ర ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ట్విటర్ ఉద్యోగుల్లో సగం మంది మస్క్ ఇంటికి పంపేశారు. అంతేకాక పెయిడ్ వెరిఫికేషన్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. అయితే ఈ ఫీచర్‌ ప్రజల్లోకి తప్పుగా వెళ్తుండటంతో, దీన్ని కొంత కాలం పాటు నిలిపివేసి, గత వారమే తిరిగి లాంచ్ చేశారు. కంటెంట్ కొత్తదనం కోసం ఆయన అనుసరించిన విధానం కూడా విమర్శలకు గురి చేసింది. దీని వల్ల తప్పుడు సమాచారం, ద్వేషపూరితమైన ప్రసంగం పెరుగుతుందని కొన్ని సివిల్ లిబర్టీ గ్రూప్‌లు ఆరోపిస్తున్నాయి.

 
మరోవైపు ట్విటర్ ప్లాట్‌ఫామ్‌పై కొందరు జర్నలిస్టుల సస్పెండ్ చేస్తూ ఎలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయాన్ని, ఐక్యరాజ్య సమితి, యూరోపియన్ యూనియన్‌లు శుక్రవారం తీవ్రంగా ఖండించాయి. మీడియా ప్లాట్‌ఫామ్ బొమ్మ కాదని ఐక్యరాజ్య సమితి ట్వీట్ చేసింది. అలాగే ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని యూరోపియన్ యూనియన్ హెచ్చరించింది.

 
సర్కస్ షో మాదిరి ట్విటర్ వ్యవహారం..
గత కొన్ని వారాల నుంచి, నెలల నుంచి ఎలాన్ మస్క్‌కి, టెస్లాకి చెడు రోజులు నడుస్తున్నాయని, ఆయన పరువుకు తీవ్ర భంగం వాటిల్లుతుందని ఈవ్స్ అన్నారు. ఎలన్ మస్క్ టెస్లాను గోల్డెన్ చైల్డ్‌గా భావిస్తారు. ఎందుకంటే ఈ బిలీనియర్ సంపదలో అత్యధిక భాగం టెస్లా కంపెనీ ద్వారానే ఆర్జిస్తున్నారు. ‘‘ట్విటర్ ప్రస్తుతం  తీవ్ర కష్టాల్లో ఉంది. ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి దీని పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిందని నేను భావిస్తున్నా. ఇది సర్కస్ షోలో ఉన్నట్టు ఉంది’’ అని ఈవ్స్ అన్నారు.

 
వచ్చే 24 గంటల్లో తప్పనిసరిగా ఎలాన్ మస్క్ ట్విటర్‌కు తాత్కాలిక సీఈవోను ప్రకటిస్తారని తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఈ పోల్‌ని ప్రారంభించిన తర్వాత కూడా మస్క్ మరో ట్వీట్ చేశారు.‘‘నేను చెబుతున్నదేమిటంటే, మీరు కోరుకునే విషయంలో, మీరు పొందే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి’’ అని మస్క్ ట్వీట్ చేశారు. అధికారం కావాలనుకునే వారే, దానికి కనీస అర్హులని మస్క్ చెప్పారు. తన ఎలక్ట్రిక్ కంపెనీ టెస్లాకు, స్పేస్ రాకెట్ సంస్థ స్పేస్‌ఎక్స్‌కు అలాగే ట్విటర్ బాస్‌గా తాను బ్యాలెన్స్ చేసుకోలేనని మస్క్‌కి హితబోధం అయిందని ఈవ్స్ అన్నారు.

 
ఈయన సృష్టించిన అతిపెద్ద సమస్యనే, అసలైన ఇబ్బందని, అడ్వర్‌టైజర్లు ఈ ప్లాట్‌ఫామ్‌ను వదిలి వెళ్లారని, ట్విటర్‌కు 90 శాతం ఆదాయం అక్కడి నుంచే వస్తుందని చెప్పారు. ఎలాన్ మస్క్ పోల్‌ని టెస్లా ఇన్వెస్టర్లు చాలా సునిశితంగా పరిశీలిస్తున్నారని ఏజే బెల్ ఇన్వెస్ట్‌మెంట్ డైరెక్టర్ రస్ మౌల్డ్ కూడా పోల్ కొనసాగే సమయంలో అన్నారు. ట్విటర్ నుంచి ఆయన తప్పుకుంటే, ఈ ఎలక్ట్రిక్ వెహికిల్ తయారీ కంపెనీ మదుపర్లకు భారీ ఊరటనిచ్చినట్టవుతుందని, టెస్లాపై ఆయన ఇక నిత్యం ఫోకస్ చేస్తారని రస్ మౌల్డ్ అన్నారు. పనిలోనే నిమగ్నమయ్యే ఎలాన్ మస్క్ తన సమయాన్ని అత్యధిక భాగం ఈ సోషల్ మీడియాపైనే వెచ్చించారు. దీంతో ఈ ఏడాది ప్రారంభం నుంచి టెస్లా షేర్లు సగానికి పైగా పడిపోయాయి.

 
ఈ సమయంలో ఎలాన్ మస్క్ వెంటనే మేల్కొని, తన ప్రధాన వ్యాపారాలను మళ్లీ పట్టాలెక్కించాల్సినవసరం ఉందని మౌల్డ్ సూచించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి అల్లుడు, ఆయన మాజీ ప్రత్యేక కార్యదర్శి అయిన జార్డ్ కుష్నర్ పక్కన నిల్చుని వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూస్తున్న ఫోటోను షేర్ చేసిన కొద్ది సేపటికే ఎలాన్ మస్క్ ఈ పోల్‌ను ట్వీట్ చేశారు. గత వారమంతా ట్విటర్‌లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. కొందరు జర్నలిస్టులను బ్యాన్ చేయడం,  ఆ తర్వాత వారిపై మళ్లీ నిషేధం ఎత్తివేయడం, ప్రత్యర్థ సోషల్ నెట్‌వర్క్‌లకు లింక్‌లను షేర్ చేయడంపై సరికొత్త విధానాన్ని తీసుకురావడం వంటి కీలకమైన పరిణామాలు ఈ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌లో చోటు చేసుకున్నాయి.

 
1.75 కోట్ల మంది ప్రజలు మస్క్ షేర్ చేసిన పోల్‌లో పాల్గొన్నారు. వారిలో 57.5 శాతం మంది ట్విటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా మస్క్ దిగిపోయేందుకు యెస్ చెప్పారు. వారిలో ఎంత మంది టెస్లా షేర్‌హోల్డర్స్ ఉన్నారన్నది ఆశ్చర్యకరం. ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ కారు కంపెనీ టెస్లా బ్రాండు విలువ భారీగా తగ్గిపోతుంది. ట్విటర్‌లోనే ఆయన అత్యధిక సమయం వెచ్చిస్తుండటంతో.. బ్రాండు వాల్యూ గతి తప్పుతుందని కొందరు అంటున్నారు. అలాగే ట్విటర్‌లో భవిష్యత్‌లో చేపట్టబోయే అత్యంత ముఖ్యమైన విధాన మార్పులకు కూడా ఓటింగ్ జరుగుతుందని ఎలాన్ మస్క్ ప్రకటించారు.

 
ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ప్రమోట్ చేసేందుకు ప్రత్యేకంగా రూపొందించిన అకౌంట్లను షట్ డౌన్ చేయనున్నట్టు ట్విటర్ ఆదివారం తెలిపింది. పాలసీ గురించి వివరణాత్మకంగా తెలిపే వెబ్ పేజీ ఇంక ఉండదని ఆదివారం పేర్కొంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మాస్టోడన్, ట్రూత్ సోషల్, ట్రైబల్, నోస్టర్ అండ్ పోస్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లతో లింక్ ఉండే లేదా ఆ ప్లాట్‌ఫామ్‌ల యూజర్ పేర్లుండే అకౌంట్లపై ప్రభావం పడుతుందని కంపెనీ తెలిపింది. అయితే ఇతర సైట్ల నుంచి పోస్టు చేసే క్రాస్ కంటెంట్‌కు మాత్రం అనుమతిస్తుంది. ‘‘మా యూజర్లలో చాలా మంది ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చురుకుగా ఉంటున్నారు. ట్విటర్‌పై కొన్ని నిర్దిష్టమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఉచితంగా ప్రమోషన్ ఇచ్చుకునేందుకు అనుమతించం’’అని వరుస ట్వీట్లలో ఈ సోషల్ మీడియా కంపెనీ తెలియజేసింది.

 
ఉదాహరణకు.. ‘‘ఫాలోమీ@యూజర్ నేమ్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్’’ లేదా ‘‘ఫేస్‌బుక్‌పై నా ప్రొఫైల్ చెక్ చేయండి-ఫేస్‌బుక్ డాట్ కామ్/యూజర్ నేమ్’’ అంటూ ఉండేవి ట్విటర్ ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లని ఈ కంపెనీ పేర్కొంది. ఈ ప్రకటన తర్వాత కొన్ని గంటల్లోనే మస్క్ సైతం తన అభిప్రాయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేశారు. ‘‘సాధారణంగా ఎప్పుడో ఒకసారి షేర్ చేసే లింక్‌లతో సమస్యేమీ లేదు. కానీ ఉచితంగా రేయింబవళ్లు ప్రత్యర్థులకు అడ్వర్టైజింగ్ ఇవ్వలేం’’ అని తెలుపుతూ మస్క్ మరో ట్వీట్ చేశారు. ఉదాహరణకు.. ‘‘ఫాలోమీ@యూజర్ నేమ్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్’’ లేదా ‘‘ఫేస్‌బుక్‌పై నా ప్రొఫైల్ చెక్ చేయండి-ఫేస్‌బుక్ డాట్ కామ్/యూజర్ నేమ్’’ అంటూ ఉండేవి ట్విటర్ ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లని ఈ కంపెనీ పేర్కొంది. ఈ ప్రకటన తర్వాత కొన్ని గంటల్లోనే మస్క్ సైతం తన అభిప్రాయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేశారు. ‘‘సాధారణంగా ఎప్పుడో ఒకసారి షేర్ చేసే లింక్‌లతో సమస్యేమీ లేదు. కానీ ఉచితంగా రేయింబవళ్లు ప్రత్యర్థులకు అడ్వర్టైజింగ్ ఇవ్వలేం’’ అని తెలుపుతూ మస్క్ మరో ట్వీట్ చేశారు.