బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 జనవరి 2023 (14:54 IST)

దైవదూషణ చట్టానికి మరింత పదును.. బెయిల్ లేకుండా కేసు

jail
పాకిస్థాన్ పాలకులు దైవదూషణ చట్టానికి మరింత పదును పెట్టారు. ఇందులోభాగంగా, సవరించిన దైవ దూషణ చట్టానికి పాకిస్థాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై ఈ చట్టం కింద కేసు నమోదైతే బెయిల్ కూడా లభించదు. అలాగే, గరిష్టంగా మరణశిక్షను కూడా విధిస్తారు. అలాగే, శిక్షతో పాటు లక్ష రూపాయల అపరాధం కూడా విధిస్తారు. 
 
ఇస్లాంను కానీ, మహ్మద్ ప్రవక్తను కానీ నిందించిన వారికి ప్రస్తుతం కఠిన శిక్షలను అమలు చేస్తున్నారు. అయితే, ఇకపై మహ్మద్ ప్రవక్తతో సంబంధం ఉన్న వ్యక్తులను అవమానించినా కఠిన శిక్షలు ఎదుర్కోక తప్పదు. ఈ మేరకు చట్టాన్ని సవరిస్తూ ప్రవేశపెట్టిన చట్టానికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 
 
తాజాగా పాకిస్థాన్ పాలకులు సవరించిన చట్టం మేరకు... మహ్మద్ ప్రవక్త భార్యలపై, సహచరులపై, దగ్గరి బంధువులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పదేళ్ల జైలు శిక్షను విధిస్తారు. అంతేకాకుండా, దానిని జీవిత ఖైదుగా కూడా మార్చే అవకాశం ఉంది. శిక్షతో పాటు లక్ష రూపాయల అపరాధం కూడా విధిస్తారు. 
 
దైవదూషణ కేసు నమోదైతే బెయిలు పొందే అవకాశమే లేదు. నిజానికి ఇప్పటివరకు మహ్మద్ ప్రవక్త బంధువులను విమర్శించిన వారికి ఇప్పటివరకు ఎలాంటి శిక్షలు లేవు. ఈ నేపథ్యంలో సవరించిన దైవదూషణ చట్టంతో ఇకపై ఈ శిక్షలు కూడా అమలు చేయనుంది.