వియత్నాంలో ప్రణబ్ ముఖర్జీ: కీలక ఒప్పందాలపై సంతకాలు!
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వియత్నాం చేరుకున్నారు. నాలుగు రోజుల అధికారిక పర్యటన కోసం ప్రణబ్ ముఖర్జీ ఆదివారం వియత్నాం చేరుకున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి వియత్నాం అగ్రనేతలతో చర్చలు జరపడంతోపాటు చమురు అన్వేషణ, విమాన సర్వీసులకు సంబంధించిన ఒప్పందాలతో సహా పలు కీలక ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేయనున్నాయి.
హానోయ్‌లోని నోయ్ బాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది. కాగా ప్రణబ్ ముఖర్జీ వియత్నాం అధ్యక్షుడు త్రువోంగ్ తాన్‌సాంగ్, ప్రధాన మంత్రి ఎన్‌గుయెన్ తాన్‌డుంగ్‌తో అంతర్జాతీయ, ప్రాంతీయ, ద్వైపాక్షిక అంశాలపై ఈ పర్యటన సందర్భంగా చర్చలు జరుపుతారు. తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి చరిత్రాత్మక నగరం హోచిమిన్‌ను కూడా సందర్శిస్తారు.