మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 2 మార్చి 2022 (17:43 IST)

ఉక్రెయిన్‌లో గుండెలు పగిలే మోతతో బాంబులు: ఇస్కీమిక్ స్ట్రోక్‌తో మరణించిన ఇండియన్ విద్యార్థి

ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మరణించాడు. రెండు రోజుల్లో రెండు మరణాలు సంభవించాయి. ఉక్రెయిన్- రష్యా సైన్యం పరస్పర దాడులతో ఉక్రెయిన్ భూభాగం దద్దరిల్లుతోంది. ఈ యుద్ధం జరుగుతున్న తరుణంలో పంజాబ్‌లోని బర్నాలాకు చెందిన భారతీయ విద్యార్థి బుధవారం మరణించాడు.

 
చందన్ జిందాల్ వయసు 22 ఏళ్లు. ఇతడు ఉక్రెయిన్‌లోని విన్నిట్సియా నేషనల్ పైరోగోవ్ మెమోరియల్ మెడికల్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. జిందాల్ ఇస్కీమిక్ స్ట్రోక్‌తో బాధపడుతున్నట్లు కనుగొన్నారు. వెంటనే అతడిని ఎమర్జెన్సీ హాస్పిటల్ విన్నిట్సియాలో చేర్పించారు. ఐతే అప్పటికే అతడు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు.

 
అతని మృతదేహాన్ని తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని అతని తండ్రి భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. ఒకరోజు క్రితం ఖార్కివ్‌లోని షెల్లింగ్‌లో మరణించిన కర్ణాటకకు చెందిన విద్యార్థి మృతదేహాన్ని కూడా తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ప్రయాణీకుల సేవల కోసం ఉక్రెయిన్‌లోని గగనతలం మూసివేయబడినందున, భారతీయ విద్యార్థుల తరలింపు కోసం జరుగుతున్నట్లుగా మృతదేహాలను కూడా అలాగే  ఇతర దేశాల ద్వారా జరగవచ్చు. 

 
ఇస్కీమిక్ స్ట్రోక్‌ అంటే ఏంటి?
మెదడులోని కొంత భాగానికి రక్త సరఫరా అంతరాయం కలగడం లేదా తగ్గినప్పుడు, మెదడు కణజాలం ఆక్సిజన్- పోషకాలను పొందకుండా నిరోధించినప్పుడు ఇస్కీమిక్ స్ట్రోక్ సంభవిస్తుంది. మెదడు కణాలు నిమిషాల్లో చనిపోవడం ప్రారంభిస్తాయి. స్ట్రోక్ అనేది వైద్యపరమైన అత్యవసర పరిస్థితి, దీనికి సత్వర చికిత్స కీలకం. ఈ స్ట్రోక్ వల్ల మెదడు దెబ్బతింటుంది.

 
కాగా ఉక్రెయిన్ బాంబు మోతలకు, భయానక దృశ్యాల వల్ల పంజాబ్ విద్యార్థి భీతి చెంది ఇలా అయి వుండవచ్చునేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.