సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 మార్చి 2022 (14:03 IST)

మేం ఓడిపోతే మాకు పట్టిన గతే మీకూ పడుతుంది : జెలెన్ స్కీ వార్నింగ్

నాటో సభ్య దేశాలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఓ వార్నింగ్ ఇచ్చారు. రష్యా తమపై చేస్తున్న దండయాత్రలో మేము (ఉక్రెయిన్) ఓడిపోతే మాకు పట్టినగతే మీకూ పడుతుందని ఆయన జోస్యం చెప్పారు. మాపై సాధించిన విజయం తర్వాత నాటో దేశాల సరిహద్దుల వద్దకు వచ్చి రష్యా తిష్టవేస్తుందన్నారు. అందువల్ల తమకు నాటో సభ్యత్వం ఇవ్వకపోయినప్పటికీ భద్రతపరంగా గ్యారెంటీ ఇవ్వాలని ఆయన కోరారు. 
 
తాజాగా సీఎన్ఎన్, రాయిటర్స్ వార్తా సంస్థలకు సంయుక్తంగా ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, సభ్యత్వం ఇవ్వకుండా నాటో కూటమి నిర్ణయం తీసుకుంటే చట్టపరంగా వచ్చే భద్రత హామీనైనా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయపరంగా భద్రత గ్యారెంటీని ఇస్తే తమ భౌగోళిక సమగ్రత, సరిహద్దులను కాపాడుకోగలుగుతామని, తమ పొరుగు దేశాలతో ప్రత్యేక సంబంధాలను కొనసాగించగలుగుతామని, తద్వారా సురిక్షితంగా ఉంటామని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
అదేసమయంలో రష్యా తమపై చేస్తున్న పోరులో ఉక్రెయిన్ ఓడిపోతే రష్యా బలగాలు నాటో సభ్య దేశాల సరిహద్దులకు వచ్చి కూర్చుంటాయన్న విషయాన్ని నాటో సభ్య దేశాలు గుర్తెరగాలని హెచ్చరించారు. ఆ తర్వాత తమకు పట్టిన గతే ఆ దేశాలకూ పడుతుందని ఆయన గద్గద స్వరంతో హెచ్చరించారు.