బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 6 జూన్ 2017 (11:13 IST)

డొనాల్డ్ ట్రంప్‌తోనూ సత్సంబంధాలున్నాయ్.. భారతీయుల భద్రతే ముఖ్యం: సుష్మా స్వరాజ్

అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్న సమయంలో అమెరికాతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నామో.. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తోనే అదే విధంగా సత్సంబంధాలు ఉన్నాయని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ

అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్న సమయంలో అమెరికాతో ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నామో.. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తోనే అదే విధంగా సత్సంబంధాలు ఉన్నాయని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు.  ప్రధాని మోదీ ట్రంప్‌తో మూడుసార్లు ఫోన్‌లో మాట్లాడారు. భారత్‌కు అమెరికా ప్రధాన రక్షణ భాగస్వామి అని ఆమె పేర్కొన్నారు. 
 
ప్రయోజనాలను ఆశించి పారిస్‌ ఒప్పందంపై భారత్‌ సంతకం చేయలేదని సుష్మా స్వరాజ్‌ తెలిపారు. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న ఆరోపణలు ఆమె ఖండించారు. అలాగే పారిస్‌ ఒప్పందం నుంచి వైదొలగాలని ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం భారత్‌-అమెరికా సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపదని సుష్మా తేల్చిచెప్పారు.
 
భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య మూడో దేశం జోక్యం అవసరం లేకుండా పరిస్థితులు చక్కబెట్టేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని సుష్మా తెలిపారు. న్యూక్లియర్‌ సప్లయర్‌ గ్రూప్‌(ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌ సభ్యత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, దీనిపై చైనాలో చర్చలు జరుపుతున్నట్లు సుష్మా వెల్లడించారు. 
 
అలాగే మూడు సంవత్సరాల పాలనలో విదేశాల్లో చిక్కుకున్న దాదాపు 80వేల మందిని సురక్షితంగా భారత్‌కు తీసుకొచ్చామని తెలిపారు. ఇతర దేశాలతో భారత్‌ సంబంధాలు మెరుగుపడ్డాయన్నారు. ప్రతీ దేశంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాం. ప్రస్తుతం భారతీయులు ఎంతో మంది విదేశాల్లో స్థిరపడుతున్నారు. అందుకు చాలా గర్వంగా ఉంది.  
 
సోమవారం మూడేళ్ల పాలనలో విదేశాంగ శాఖ సాధించిన విజయాలపై స్పందించిన ఆమె.. విదేశాల్లో ఉన్న భారతీయులు భద్రతకు భారత్‌ మొదటి ప్రాధాన్యత ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. ట్విట్టర్‌ ద్వారా ఎంతో మంది భారతీయులకు సహాయం చేసినట్లు సుష్మా తెలిపారు. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) దృష్టికి తీసుకెళ్లే దమ్ము పాకిస్థాన్‌కు లేదని సుష్మా అన్నారు. 
 
దాయాది దేశంతో ఉన్న అన్ని సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ భావిస్తోందని పేర్కొన్న మంత్రి ఉగ్రవాదం, చర్చలు రెండూ కుదరని పని అని కుండబద్దలు గొట్టారు. చర్చలు కావాలంటే ఉగ్రవాదానికి పాక్ పుల్‌స్టాప్ పెట్టాల్సిందేనన్నారు.