1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 25 జులై 2025 (22:48 IST)

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

air india express
గగనతలంలో 35 వేల అడుగుల ఎత్తులో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మస్కట్ నుంచి ముంబైకు వెళుతున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో గురువారం ఉదయం ఒక థాయ్‌లాండ్‌ మహిళా ప్రయాణికురాలు బాలుడికి జన్మనిచ్చింది. విమాన సబ్బంది, విమానంలో ఉన్న ఒక నర్సు సహాయంతో ఈ ప్రసవం విజయవంతంగా జరిగింది. 
 
ఎయిర్‌లైన్ సంస్థ వెల్లడించిన వివరాల మేరకు.. 29 యేళ్ల థాయ్‌లాండ్ జాతీయురాలు ప్రసవ వేదనలోకి వెళ్లిన వెంటనే క్యాబిన్ క్రూ సిబ్బంది వేగంగా స్పందించారు. తల్లి, బిడ్డ గోప్యతను కాపాడటానికి ప్రయాణికులు సీట్లు మార్చారు. అలాగే ఫోన్‌లను పక్కన పెట్టమని సూచించారు. ఈ క్రమంలో తెల్లవారుజామున 3.15 గంటలకు 35 వేల అడుగుల ఎత్తులో ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. 
 
విమాన పైలెట్లు వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ను సంప్రదించి విషయాన్ని వివరించారు. విమానం ఉదయం 4.02 గంటలకు ముంబైలో ల్యాండ్ అయిన వెంటనే తల్లి, బిడ్డను సమీప ఆస్పత్రికి తరలించారు. ఆమెకు సహాయం అందించడానికి ఓ మహిళా ఎయిర్‌ లైన్ సిబ్బంది కూడా ఆస్పత్రికి వెళ్లారు అని తెలిపింది.