శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 జనవరి 2021 (13:10 IST)

మైనర్లుపై లైంగికదాడులు... మత బోధకుడికి వెయ్యేళ్ళ జైలుశిక్ష

టర్కీ దేశంలో ఓ మత ప్రబోధకుడుకి స్థానిక కోర్టు ఒకటి వెయ్యేళ్ళ జైలుశిక్ష విధించింది. మైనర్లపై లైంగికదాడులు, ఆర్మీ గూఢచర్యం, బ్లాక్‌మెయిలింగ్ వంటి కేసుల్లో దోషిగా తేల్చి, వెయ్యేళ్ళ జైలుశిక్ష విధించారు. ఈ వివాదాస్పద ముస్లిం మత బోధకుడు పేరు అద్నన్ ఒక్తర్‌. కోర్టు 1,075 సంవత్సరాల శిక్ష విధించింది. 
 
ఒక్తర్ గతంలో 'ఎ9' అనే చానల్ ఏర్పాటు చేసి అందులో మత బోధనలు చేస్తూ పాపులర్ అయ్యాడు. అర్థనగ్నంగా ఉన్న అమ్మాయిల మధ్య కూర్చుని విలాసవంతంగా కనిపిస్తూ చర్చలు నిర్వహించేవాడు. 
 
ఒకసారి అతడు మహిళలతో డ్యాన్స్ చేస్తూ పురుషులతో కలిసి పాడుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులోని మహిళలను పిల్లి కూనలు (కిటెన్స్) అని, పురుషులను తన సింహాలు (లయన్స్) అంటూ అభ్యంతరకర రీతిలో పేర్కొన్నాడు. 
 
దీంతో అతడి కార్యక్రమాలపై నిఘా పెట్టిన టర్కీ మీడియా వాచ్‌డాగ్ ఆ చానల్‌ను నిషేధించింది. జులై 2018న అద్నన్ ఇంటిపై దాడిచేసిన పోలీసులు, అవినీతి నిరోధక శాఖ అధికారులు అద్నన్‌తోపాటు మరో 77 మందిని అరెస్ట్ చేశారు.
 
మైనర్లపై లైంగికదాడులు, అత్యాచారాలకు పాల్పడడం, నేరస్థులను ప్రోత్సహించడం, బ్లాక్‌మెయిలింగ్, గూఢచర్యం వంటి అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం మొత్తం 10 కేసుల్లో అతడిని దోషిగా తేల్చింది. 
 
అతడితోపాటు మరో 13 మందికి కఠిన కారాగార శిక్షలు విధించింది. అందరికీ కలిపి ఏకంగా 9,803 సంవత్సరాల ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ఒక్క అద్నన్‌కే 1,075 సంవత్సరాల మూడు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
 
కాగా, 64 ఏళ్ల అద్నన్ 300కు పైగా పుస్తకాలను రాశాడు. 73 పుస్తకాలను అనువదించాడు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన అద్నన్.. పథకం ప్రకారం కుట్ర చేసి తనను ఇరికించారని, కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్తానని పేర్కొన్నాడు.