బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 ఏప్రియల్ 2020 (16:35 IST)

ఇది ప్రార్థనల కోసం ఒకచోట చేరే సమయమిదికాదు... : ఏఆర్ రెహ్మాన్

దేశాన్ని కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. ఈ వైరస్ బారినుంచి ప్రజలను కాపాడుకునేందుకు సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా కొన్ని మతాల వారు సామూహిక ప్రార్థనల పేరుతో ఒకచోట చేరుతున్నారు. ఇలాంటి చర్యలను ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. 
 
ముఖ్యంగా, ఢిల్లీ, నిజాముద్దీన్ మర్కజ్‌లో జరిగిన సమ్మేళనం దేశ వ్యాప్తంగా ఎంతో ఎలజడి సృష్టించింది. మత ప్రార్ధ‌న‌ల కోసం గ‌త నెల‌ ఢిల్లీ వెళ్లిన వారు ఇటీవ‌ల సొంత రాష్ట్రాల‌కి చేరుకున్నారు. వీరిలో చాలా మందికి క‌రోనా వైర‌స్ సోక‌డంతో వారి ఆచూకీ క‌నుగొనే ప‌నిలో ప‌డ్డారు పోలీసులు. అయితే ఢిల్లీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ప్ర‌ముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. 
 
క‌రోనాని అరిక‌ట్టేందుకు రేయింబ‌వ‌ళ్ళు క‌ష్ట‌ప‌డుతూ త‌మ ప్రాణాల‌ని ఫణంగా పెడుతున్న వైద్యులు, నర్సులు, ఇత‌ర సిబ్బందికి ధ‌న్యావాదాలు తెలిపారు. క‌రోనాని క‌ట్టడిలో భాగంగా త‌మ ప్రాణాలు ప్రమాదంలో పెట్టి  మ‌న కోసం ఎంత‌గానో కృషి చేస్తున్న వారి తీరును అభినందించాలన్నారు. ప్రాణాంతక వైరస్‌తో పోరాడాల్సిన ప్రస్తుత తరుణంలో భేషజాలకు వెళ్లకుండా అంతా కలిసికట్టుగా ఉండాలని సూచించారు. 
 
ఇపుడు కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నామని.. ఇటువంటి సమయంలో మానవత్వాన్ని పరిమళింపజేయాలని సూచించారు. మ‌త‌ప‌ర‌మైన ప‌విత్ర స్థలాల‌లో గుమిగూడే స‌మ‌యం ఇది కాదు. దేవుడు మ‌న హృద‌యంలోనే ఉన్నాడు. ప్ర‌భుత్వం చెప్పిన సూచ‌న‌లు త‌ప్ప‌క పాటించండి. 
 
స్వీయ నియంత్ర‌ణ పాటిస్తే ఎక్కువ రోజులు బ‌త‌క‌వ‌చ్చు. వైర‌స్‌ని వ్యాప్తి చేస్తూ, సాటి మ‌నుషుల‌కి హాని క‌లిగించ‌కండి. మీరు వైర‌స్ సోక‌దు అనుకుంటే అది మూర్ఖ‌త్వ‌మే. వ‌దంతులు వ్యాప్తి చేసి ప్ర‌జ‌ల‌లో భ‌యాందోళ‌న‌లు క‌లిగించ‌కండి. ల‌క్ష‌ణాది మంది ప్రాణాలు మ‌న చేతిలో ఉన్నాయి. కొంచెం జాగ్ర‌త్త‌గా ఉండ‌డం అంటూ రెహమాన్ త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు.