శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 మార్చి 2020 (10:41 IST)

ఏపీని భయపెడుతున్న 'ఢిల్లీ ప్రయాణం' - కొత్త కేసులకు అదే మూలం

ఢిల్లీలోని వెస్ట్ హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భారీ సంఖ్యలో హాజరైనట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన ఆరు కొత్త కరోనా కేసుల ట్రావెల్ హిస్టరీని పరిశీలిస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. ఈ ఆరుగురు కరోనా బాధితులు ఢిల్లీలో జరిగిన మతపరమైన కార్యక్రమంలో పాల్గొని తిరిగివచ్చినట్టు తేలింది. ఇదే విధంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందినమంది పదులు, వందల సంఖ్యలో ఈ ఢిల్లీ కార్యక్రమానికి వెళ్లి వచ్చారు. ఇదే ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది. 
 
ముఖ్యంగా, ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో అనంతపురం, కడప, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్టణం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన వారు ఉన్నట్టు గుర్తించారు. వీరిలో 200 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా ఐదుగురికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. నమూనాలు సేకరించిన 200 మందిలో 103 మంది ఒక్క ప్రకాశం జిల్లావారే కావడం గమనార్హం. వీరందరినీ వివిధ ప్రాంతాల్లో క్వారంటైన్‌లో ఉంచారు.
 
అలాగే, ఢిల్లీలో జరిగిన మత కార్యక్రమంలో పాల్గొని వచ్చిన విజయవాడ యువకుడి తల్లిదండ్రులు ఒక్క రోజు వ్యవధిలోని చనిపోవడం, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఓ వృద్ధుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంతో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. చనిపోయిన వారి నమూనాలను సేకరించిన అధికారులు పరీక్షలకు పంపించారు.
 
అనంతపురం జిల్లా లేపాక్షిలో పదేళ్ల బాలుడి తల్లి ఇటీవల మక్కా వెళ్లి వచ్చింది. మూడు రోజుల క్రితం ఆమె మృతి చెందగా, బాలుడిలో కరోనా లక్షణాలు కనిపించాయి. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మొత్తం 40 మంది కరోనా అనుమానిత లక్షణాలతో చికిత్స పొందుతుండగా, వీరిలో 17 మంది ఢిల్లీ నుంచి వచ్చినవారే కావడం గమనార్హం. వీరిలో 72 ఏళ్ల వృద్ధుడికి కరోనా ఉన్నట్టు పరీక్షల్లో తేలింది.
 
ఇక... ఈ సమావేశానికి నెల్లూరు నుంచి 70 మంది హాజరైనట్లు సమాచారం. ప్రస్తుతం 25 మందిని నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రిలోని కరోనా సెంటర్‌కు పంపించారు. మిగిలిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. కృష్ణా జిల్లా నుంచి దాదాపు 40 మంది ఢిల్లీకి వెళ్లారు. వీరందరినీ అధికారులు హోం క్వారంటైన్‌లో ఉంచారు. 
 
కడప జిల్లా నుంచి 49 మంది ఢిల్లీ సదస్సుకు హాజరయ్యారు. వీరిలో 47 మందిని  ఐసొలేషన్‌ వార్డులకు తరలించారు. అదేవిధంగా విశాఖ నుంచి ఢిల్లీకి వెళ్లి వచ్చిన 30 మందిని అధికారులు గుర్తించి క్వారంటైన్‌కు పంపారు. అయితే, వీరంతా వచ్చి 14 రోజులు  దాటిందని, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.