శనివారం, 27 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Last Updated : గురువారం, 25 సెప్టెంబరు 2025 (12:57 IST)

OG Review: పవన్ కళ్యాణ్ ఓజీ.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్.. ఓజీ ఒరిజినల్ రివ్యూ

Pawan Kalyan, OG
Pawan Kalyan, OG
నటీనటులు: పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్, ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, తేజ్ సప్రు, సుదేవ్ నాయర్, రాహుల్ రవీంద్రన్ తదితరులు 
 
సాంకేతికత: ఛాయాగ్రహణం: రవి.కె.చంద్రన్, సంగీతం: తమన్,  నిర్మాతలు: డీవీవీ దానయ్య,కళ్యాణ్ దాసరి, రచన-దర్శకత్వం: సుజీత్
 
రాజకీయాల్లోకి వచ్చాక పవన్ తన అభిమానులను అలరించడానికి చేసిన హరిహర వీరమల్లు కూడా తీవ్ర నిరాశకు గురి చేసింది. కానీ అభిమానుల కోసం దే కాల్ హిమ్ ఓజీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూశారు. విడుదలకు ముందు రకరకాల పబ్లిసిటీలతో అలరించిన ఓజీ కొద్దిరోజుల ముందు థమన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన పబ్లిసిటీ సాంగ్ ఆకట్టుకునే వుంది. దాంతో  దర్శకుడు సుజీత్ స్టయిలిష్ మూవీని తీశాడనేది అర్థమయింది. ఇక ఈరోజే విడుదలైన ఓజీ ఎలా వుందో చూద్దాం.
 
కథ: 
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ లో పరిస్థితి మారిపోతుంది. అక్కడ సంపాదించిన బంగారంతో ముంబై వచ్చి షిప్ యార్డ్ బిజినెస్ లో వందలాది మందికి పని కల్పించాలనే శరణార్థులు వున్న షిప్ లో బయలుదేరతాడు సత్య దాదా (ప్రకాష్ రాజ్). ప్రయాణంలో కొందరు దొంగలు దాడిచేసి అక్కడివారిని చంపేసి బంగారాన్ని దొంగలించుకోబోతుంటే చూస్తూ సహించలేని ఓ కుర్రాడు జపాన్ లో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ తో అందరినీ చంపేసి సత్యదాదాను కాపాడతాడు. దాంతో అతనిని తన కొడుకులా ముంబై తీసుకు వచ్చి చూసుకుంటాడు. ఆ కుర్రాడే ఓజాస్ గంభీర అలియాస్ ఓజీ (పవన్ కళ్యాణ్). 
 
ఓజీ ఓ అనాథ. జపాన్లో సమురాయిల సమూహంలో పెరిగి పెద్దవాడవుతూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాడు. ముంబయిలో పోర్టు పెట్టి వేల మందికి ఉపాధి కల్పించిన సత్య దాదాను ఓజీ జాగ్రత్తగా కాపాడు కుంటూ వస్తుంటాడు. అలాంటిది వ్యతిరేక వర్గంకు చెందిన బాంబులున్న కంటైనర్ ను సత్యదాదా దాచేస్తాడు. దానివల్ల ముంబై ను నాశనం చేయాలనుకున్నవిదేశాల్లో వున్న పెద్ద డాన్ ప్లాన్ పారకపోవడంతో కంటైనర్ కోసం తన అనుచరుడు ఓమి బవు (ఇమ్రాన్ హష్మి)ని ముంబై పంపిస్తాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఓజీ కుటుంబంపై ఓమి దాడి చేస్తాడు. ఆ తర్వాత ఏమి జరిగింది? ఇంతకీ ఓమి ఎవరు.. అతడి లక్ష్యమేంటి.. తన వల్ల సత్య దాదాకు వచ్చిన కష్టమేంటి? అనేవి మిగిలిన కథ.
 
సమీక్ష:
కుటుంబకథలతో సినిమాలు తీయడం వేరు, యూత్ కోసం సినిమా తీయడం వేరు. కానీ అభిమానుల కోసం ఓ అభిమాన దర్శకుడు సినిమా చేయడం ఈమధ్య జరుగుతున్నాయి. అలా సాహో చేశాక ఆ రిజల్ట్స్ తెలిశాక పవన్ కళ్యాణ్ చేసిన సినిమా ఓజీ. కనుకనే సినిమా అంతా అభిమానులను అలరించడానికే స్టయిలిష్ గా తీశాడు. అందులోనూ బాంబులతో నాశనం చేయాలకునే కరడుకట్టిన విదేశీ మాఫియా కథను ఎంచుకున్నాడు. ఆ క్రమంలో చెప్పడానికి చిన్న కథే అయినా తీసి చూపించే విధానంలో చాలా పెద్ద కథగా వుంటుంది. అందుకు రకరకాల పాత్రలు వస్తుంటాయి. పోతుంటాయి.
 
సినిమా మొత్తం రక్తసిక్తంగా వుంటుంది. మాఫియాలంటే ఇంత క్రూరంగా వుంటారా? అనిపిస్తుంది కూడా. అందుకు తగిన విధంగానే హీరో పాత్ర డిజైన్ చేశారు. ఆ పాత్రలో పవన్ కళ్యాణ్ పెద్దగా నటించింది ఏమీ వుండదు. స్టయిలిష్ గా నడుకుంటూ, డైలాగ్ చెప్పడం, లుక్ లు ఇవ్వడమే సినిమాలో ప్రత్యేకత.
 
ఇక ఈ సినిమాకు ప్రాణం థమన్ సంగీతం. సినిమా అంతా నేపథ్య సంగీతం మీద నడుస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే థమన్ ఈ సినిమాకు హీరో అని అనుకోవాలి. ఆ సంగీతమే లేకపోతే సినిమా చాలా సప్పగా వుండేది. గతంలో కమల్ హాసన్, మమ్ముట్టి, రజనీకాంత్, మోహన్ లాల్ చేసిన పలు సినిమాలు గుర్తుకురాకమానదు. అప్పట్లో అది ట్రెండ్. ఇప్పుడు కొత్త జనరేషన్ కోసం ప్రపంచ మార్కెట్ కోసం చేసిన సినిమాగా చెప్పుకోవచ్చు. 
 
కేవలం పవన్ కళ్యాణ్ తను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ను ఈ సినిమా కోసం బాగా ఉపయోగించుకున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే దాని కోసమే సినిమా తీశారనుకోవచ్చు. ఇంత సీరియస్ కథలో తండ్రిలా పెంచిన ప్రకాశ్ రాజ్, శ్రియారెడ్డి పాత్రలతో సెంటిమెంట్ కొద్దిగా వర్కవుట్ చేశారు. ఇక విలన్ ఇమ్రాన్ కూడా స్టయిలిష్ గా యాక్ట్ చేస్తాడు. కత్తి, తుపాకీ గానీ పట్టుకుంటే చంపేయడమే పని అతనికి. గతంలో కె.జి.ఎఫ్. సినిమాలో హింసను ఎక్కువనుకున్నాం. దానికి మించిన హింస, రక్తపాతం ఓజీ లో వుంది. అలా వుంటేనే వారికి గ్యాంగ్ కు నాయకుడు అవుతాడు. అందుకే ఓజీ అంటారు. ఓజి అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని ప్రకాష్ రాజ్ పాత్రతో దర్శకుడు అనిపిస్తాడు.
 
ఐతే అభిమానులను దాటి సగటు ప్రేక్షకులను మెప్పించడానికి ఏం చేశారన్నదే అంతిమంగా ఓజీ గురించి చెప్పడం కష్టమే. వారి ఆదరణ బట్టి సినిమా సక్సెస్ వుంటుంది. గ్యాంగ్ స్టర్ డ్రామా ఊబిలో పడిపోవడంతో కథ పరంగా కొత్తగా అతను చేయడానికి పెద్దగా ఏమీ లేకపోయింది. డైరెక్టర్ చేసిన సాహో చూశాక కూడా ఆయనతో  ఓజీ సినిమా చేయడం నిర్మాతలు చేసిన సాహసంగా చెప్పకతప్పదు. జపాన్ నేపథ్యం తీసుకుని సమురాయిల శిక్షణలో రాటుదేలిన కుర్రాడిగా హీరో పాత్రను కాస్త భిన్నమైన నేపథ్యంతో మొదలుపెట్టి ఆశలు రేకెత్తించినా.. ఆ తర్వాత వ్యవహారమంతా కొత్తసీసాలో పాతనీదరుగా అనిపిస్తుంది.
 
ఈ కథకు దర్శకుడు, కెమెరామన్, మ్యూజిక్ డైరెక్టర్ ముగ్గురూ కలిసి తమ బెస్ట్ ఇచ్చారు. ఓజాస్ ముంబయికి తిరిగి వచ్చాక తర్వాత ఏం చేస్తాడనే విషయంలో పెద్దగా సర్ప్రైజులేమీ లేవు. హీరో-విలన్ మధ్య ఎత్తులు పై ఎత్తులు అంత ఆసక్తికరంగా అనిపించవు. ఎంతసేపూ హీరోను ఎలివేట్ చేయడమే లక్ష్యంగా సన్నివేశాలు సాగుతుంటే.. సినిమా ఏకపక్షంగా మారిపోయి ఆసక్తి సన్నగిల్లిపోతుంది. హీరో ముందు విలన్ పాత్ర అంత బలంగా కనిపించకపోవడం మైనస్. కథలో ఏదైనా గొప్ప ట్విస్టు ఉంటుందేమో అని ఆశిస్తే నిరాశ తప్పదు. 
 
మొత్తంగా చెప్పాలంటే, పవన్ అభిమానులకు అయితే ‘ఓజీ’ కనువిందుగా అనిపిస్తుంది.హరిహర వీరమల్లు లోగా దాగుడుమూతలు ఆడినట్లు కాకుండా ఇందులో పవన్ మీద యాక్షన్ ఘట్టాలను కొంచెం నమ్మశక్యంగా అనిపించేలా తీశారు. ప్రియాంక అరుల్ మోహన్ పాత్ర మేరకు చేసింది. శ్రియారెడ్డి సలార్ చేసినటువంటి పాత్రను ఇంచుమించు పోలినట్లుగా వుంటుంది.  మరో విలన్ సుదేవ్ నాయర్ ఆకట్టుకున్నాడు. సత్య దాదాగా కీలక పాత్రలో ప్రకాష్ రాజ్ రాణించాడు. అర్జున్ దాస్ పాత్ర నిరాశపరుస్తుంది. జైలర్.. లియో లాంటి సినిమాలకు తన సమాధానం ఓజీ అంటూ తమన్ అంత ధీమాగా ఎందుకు చెప్పాడో సినిమా చూశాక అర్థమవుతుంది.
 
 యాక్షన్ ఎపిసోడ్లు  ఎలివేషన్ సీన్లు ఎన్ని వున్నా కథలో కొత్తదనం చూపించలేకపోయాడు దర్శకుడు. మొత్తంగా చూస్తే ఈ దసరాకు ఓజీ సినిమా మినహా ఇతర సినిమాలు లేకపోవడంతో నిర్మాతకు లాభం చేకూరుతుందో చూడాలి. ఎలాగూ మిరాయ్ వంటి సినిమాలు కూడా వున్నాయి. అంతకుమించిన సినిమా కనుచూపుమేరలో లేవు కనుక సామాన్యుడి ఆదరణ బట్టి సినిమా వుంటుందని చెప్పవచ్చు.
రేటింగ్ : 2.5/5