శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (07:30 IST)

ఒకడు చేసిన పని మా ఐక్యతను దెబ్బతీయదు: భారతీయులకు అమెరికన్ల హామీ

‘ఒకడు చేసిన చెడ్డ పని అమెరికా ఐకమత్యాన్ని దెబ్బతీయదు. భారత–అమెరికన్లకు మేం అండగా ఉంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం’ అని కాన్సస్‌ మేయర్‌ కోప్‌లాండ్‌ తెలిపారు. బాధితుడి కుటుంబానికి న్యాయం జరిగేందుకు కృషిచేస్తామని పోలీస్‌ చీఫ్‌ మెంకే వెల్

‘ఒకడు చేసిన చెడ్డ పని అమెరికా ఐకమత్యాన్ని దెబ్బతీయదు. భారత–అమెరికన్లకు మేం అండగా ఉంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటాం’ అని కాన్సస్‌ మేయర్‌ కోప్‌లాండ్‌ తెలిపారు. బాధితుడి కుటుంబానికి న్యాయం జరిగేందుకు కృషిచేస్తామని పోలీస్‌ చీఫ్‌ మెంకే వెల్లడించారు. విద్వేషపూరిత ఉద్దేశంతో జరిగిన భారత ఇంజనీర్‌ కూచిభొట్ల శ్రీనివాస్‌ హత్యకు నిరసనగా అమెరికాలోని కాన్సస్‌ సిటీలో వందల మంది క్యాండిల్స్‌ పట్టుకుని శాంతి ర్యాలీ నిర్వహించారు. ‘శాంతి కావాలి. ప్రేమతో ఉండాలి. సమాజంలో ఐకమత్యం కావాలి. కలిసుంటేనే కలదుసుఖం’ అని నినాదాలు చేశారు. విద్వేషపూరిత రాజకీయాలకు మద్దతివ్వమని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దని ముక్తకంఠంతో తెలిపారు.
 
ఈ ర్యాలీలో గత బుధవారం నాటి కాల్పుల్లో గాయపడిన అలోక్‌ రెడ్డి సహా.. మృతుడు శ్రీనివాస్‌ మిత్రులు, సన్నిహితులు, దాదాపు 200 మంది భారత–అమెరికన్లు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సంస్మరణ సభలో.. కాన్సస్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జెఫ్‌ కాల్యర్, చట్ట సభ్యుడు కెవిన్  యోడర్, ఒలేత్‌ మేయర్‌ మైక్‌ కోప్‌లాండ్, పోలీస్‌ చీఫ్‌ స్టీవెన్  మెంకే, ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ శాంతి సమావేశానికి హాజరయ్యారు. వివిధ మతాల పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
 
భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న ఇయాన్  గ్రిలాట్‌ ‘ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణమిచ్చేందుకూ సిద్ధమే’ అని తెలిపారు. ‘బార్‌లో కుటుంబాలతో, చిన్న పిల్లలతో వచ్చిన వారంతా బాస్కెట్‌బాల్‌ మ్యాచ్‌ చూస్తున్నారు. చాలా మందే అక్కడున్నారు. ఇంతలోనే ఇద్దరిపై కాల్పులు చేస్తున్న పురింటన్ ను చూశాను. వాళ్ల ప్రాణాలు కాపాడేందుకు నా ప్రాణాలు బలిచ్చేందుకూ వెనకాడలేదు. నేను ఏదోఒకటి చేయాలి. అందుకే అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాను’ అని గ్రిలాట్‌ తెలిపాడు. పురింటన్ తో పెనుగులాటలో గ్రిలాట్‌ ఛాతీలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. అయితే దీన్ని తొలగించటంతో ప్రాణాపాయం తప్పినా.. ఆయన కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు.