భారత మార్కెట్లలోకి జియోబుక్ ల్యాప్‌టాప్.. ఫీచర్స్ సంగతేంటి?
అతి చౌక ధరలో డేటాతో రిలయన్స్ జియో సంచలనానికి తెర లేపింది. అలాగే అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ (జియో ఫోన్ నెక్ట్స్)ను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా జియోబుక్ ల్యాప్‌టాప్‌ను కూడా ప్రకటిస్తుందని సమాచారం. భారత మార్కెట్లలోకి జియోబుక్ ల్యాప్‌టాప్‌ను మరి కొద్ది రోజుల్లోనే లాంచ్ చేయనుందనే ఊహాగానాలు వస్తున్నాయి.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్‌సైట్‌లో సర్టిఫికేషన్ కోసం జియోబుక్ ల్యాప్‌టాప్ వచ్చినట్లు తెలుస్తోంది. జియో నుంచి రాబోయే ల్యాప్‌టాప్ మూడు వేరియంట్లు బీఐఎస్ సర్టిఫికేషన్ సైట్‌లో కంపెనీ లిస్ట్ చేసింది. కాగా జియో ల్యాప్‌టాప్ లాంచ్ డేట్ మాత్రం కన్ఫర్మ్ అవ్వలేదు. జియోబుక్ 4జీ ఎల్‌టీఈ కనెక్టివిటీతో వస్తుందని తెలుస్తోంది.
స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 4జీబీ ఎల్‌పీడీడీఆర్‌ఎక్స్ ర్యామ్, 64 జీబీ రామ్ స్టోరేజ్‌తో రానుంది. జియోబుక్ ధర ఇంకా తెలియాల్సి ఉండగా తక్కువ ధరల్లోనే జియోబుక్ ఉంటుందని టెక్ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్‌ఫోన్‌గా పేర్కొన్న జియో ఫోన్ నెక్ట్స్ లాంఛింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. రిలయన్స్ 44 ఏజీఎం సమావేశంలో వినాయక చవితికి తమ ఫోన్‌ను లాంఛ్ చేస్తామని కంపెనీ చైర్మన్ ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు.
కాగా ఈ ఫోన్‌ను దీపావళి పండుగకు లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా జియోఫోన్‌నెక్ట్స్ లాంచ్ రిలయన్స్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ వాయిదా పడడంతో రిలయన్స్ షేర్లు సోమవారం రోజున 2 శాతం మేర నష్టపోయాయి.
సోమవారం జరిగిన బీఎస్‌ఈ ఇంట్రా డే ట్రేడ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 2 శాతం క్షీణించి రూ .2,382.85 వద్ద నిలిచింది. ట్రేడింగ్ ప్రారంభంలో రిలయన్స్ షేర్ విలువ రూ. 2425.60 వద్ద ఉండగా ట్రేడింగ్ ముగిసే సమయానికి సుమారు రూ. 55.80 మేర నష్టపోయి షేర్ విలువ రూ. 2,382.85 వద్ద నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమీకండక్టర్ కొరత కారణంగా జియోఫోన్‌నెక్ట్స్ లాంచింగ్ వాయిదా పడిందని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు.