బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , మంగళవారం, 6 జూన్ 2017 (02:37 IST)

సోషల్ మీడియాలో ఇది బాహుబలి.. అయినా మీ ఫోన్లలో వాట్సాప్ ఇక పనిచేయదు.. ఎందుకు?

ఇప్పుడు ప్రపంచానికి పరిచయం చేయనవసరం లేని అత్యాధునిక సాంకేతిక సాధనం వాట్సాప్. ప్రపంచం నలుమూలల్లో కోట్లాదిమంది బంధుత్వాలను, స్నేహాలను, పరిచయాలను కలుపుతున్న ఏకైక, సింపుల్ సాధనం వాట్సాప్. దీనిదెబ్బకు ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి అత్యంత ప్రజాదరణ కలిగిన సోషల్

ఇప్పుడు ప్రపంచానికి పరిచయం చేయనవసరం లేని అత్యాధునిక సాంకేతిక సాధనం వాట్సాప్. ప్రపంచం నలుమూలల్లో కోట్లాదిమంది బంధుత్వాలను, స్నేహాలను, పరిచయాలను కలుపుతున్న ఏకైక, సింపుల్ సాధనం వాట్సాప్. దీనిదెబ్బకు ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి అత్యంత ప్రజాదరణ కలిగిన సోషల్ మీడియా విభాగాలు కూడా వెనుకంజ వేశాయి. తమ బంధువులు, స్నేహితులతో నిత్యం టచ్‌లో ఉండటానికి ఇప్పుడు చాలామందికి వాట్సాప్‌ నిత్యావసర సాధనంగా మారిపోయింది. ఈ యాప్‌ను తమ వ్యాపార, వాణిజ్య అవసరాలకు ఉపయోగించేవారు కూడా లేకపోలేదు. 
 
ఫేస్‌బుక్‌ యాజమాన్యంలోని వాట్సాప్‌ ఇటీవలికాలంలో అనేక కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరికొత్తగా ‘స్టేటస్‌’ ఫీచర్‌ను కూడా తీసుకొచ్చింది. వాట్సాప్‌ తీసుకొచ్చిన కొత్త కొత్త ఫీచర్లు చాలా ఆదరణ పొందుతున్నాయి కూడా. ఈ నేపథ్యంలో అనేక ఆధునాతన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్న వాట్సాప్‌ అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోతే ఎలా ఉంటుంది జీర్ణించుకోవడం కష్టమే కదా. 
 
కానీ కొందరు యూజర్లకు ఈ బాధ తప్పకపోవచ్చు. గత ఏడాది ఈ విషయమై కంపెనీ ఒక అధికారిక ప్రకటన చేసింది. తమ ఫీచర్లను విస్తరిస్తున్న క్రమంలో కొన్ని మొబైల్‌ డివైజ్‌లలో వాట్సాప్‌ పనిచేయకపోవచ్చునని, 2016 చివరి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నది. కానీ, దీనిపై కొంత భిన్న స్పందన రావడంతో ఈ నిర్ణయాన్ని వాట్సాప్‌ ఈ ఏడాది జూన్‌ 30వరకు వాయిదా వేసింది.

ఇప్పుడు ఈ నిర్ణయం కచ్చితంగా అమలుకానున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం కనుక అమలైతే.. చాలావరకు ఫోన్లలో వాట్సాప్‌ సపోర్ట్‌ చేయకపోవచ్చు. కంపెనీ తన అధికారిక ప్రకటనలో తెలిపిన ప్రకారం.. ఈ ఫోన్లలో జూన్‌ 30 తర్వాత వాట్సాప్‌ సపోర్ట్‌ చేయబోదు.
 
బ్లాక్‌బెర్రీ (బ్లాక్‌బెర్రీ 10 సహా)
నోకియా ఎస్‌40
నోకియా సింబియన్‌ ఎస్‌60
ఆండ్రాయిడ్‌ 2.1 , ఆండ్రాయిడ్‌ 2.2
విండోస్‌ ఫోన్‌ 7.1
ఐఫోన్‌ 3జీఎస్‌ఐవోఎస్‌ 6
 
ఈ వెర్షన్‌ ఫోన్లు ఉన్నవాళ్లు తమ సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్‌ చేసుకొని వాట్సాప్‌ సేవలను యథాతథంగా పొందవచ్చునని కంపెనీ గతంలోనే తెలిపింది. అంతేకాదు, తన యూజర్లకు మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు వాట్సాప్‌ సిద్ధమవుతోంది. విండోస్‌ యూజర్లకు చాట్‌డాటాను ఆర్గనైజ్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నట్టు సమాచారం. ఈ ఫీచర్‌ ఉంటే.. ఫొటోలు, జిప్‌లు, వీడియోలు, మెసేజ్‌లు యూజర్లు తమకు నచ్చినట్టు ఒకేచోట ఆర్గనైజ్‌ చేసుకోవచ్చు.
 
ఇది వాట్సాప్ యుగం. సోషల్ మీడియాలో ఇదొక బాహుబలి. వాట్సాప్ సందేశాలు లేకుండా ఇక ప్రపంచం ఒక్కక్షణం కూడా మనలేదన్నది పచ్చినిజం. సాంకేతిక జ్ఞానం మాకొద్దు అని మొండికేసిన మహా ముదుర్లు కూడా వాట్సాప్‌కు ఆకర్షితులు కావలసిందే మరి.