1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 12 మే 2016 (08:38 IST)

జాతీయ స్థాయిలో నదుల అనుసంధానం అసాధ్యం : ఎంఎం జోషి

జాతీయ స్థాయిలో నదుల అనుసంధానం ఆచరణలో అసాధ్యమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత గంగా ప్రక్షాళన పార్లమెంటరీ సంఘం అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషీ స్పష్టం చేశారు. గంగా ప్రక్షాళనపై అంచనాల కమిటీ నివేదికను సమర్పించిన అనంతరం బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 
 
దీనిపై ఆయన మాట్లాడుతూ.. గంగా ప్రక్షాళన పనులు సాఫీగానే సాగిపోతున్నాయన్నారు. అదేసమయంలో ఎన్డీయే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నదుల అనుసంధానం అంత సులభమైన విషయమేమీ కాదన్నారు. 
 
చిన్న స్థాయిలో నదుల అనుసంధానం సాధ్యమైనప్పటికీ.. జాతీయ స్థాయిలో అసాధ్యమని చెప్పుకొచ్చారు. నదుల అనుసంధానానికి సంబంధించి పంపుసెట్ల ద్వారా ఒక చివర నుంచి మరో చివరికి నీటిని ఎత్తిపోయడానికి వేల కిలోవాట్ల విద్యుత్తు అవసరమవుతుందన్నారు. విద్యుత్ కొరత తీవ్రంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యమన్నారు.