ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం : హోం మంత్రి అమిత్ షా
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి లోబడి దేశంలో మతపరమైన రాజకీయాలకు తాము వ్యతిరేకమని, ముస్లింలకు ఇచ్చిన రిజర్వేషన్లను తొలగించి వాటిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా, భువనగిరిలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఫలితాలను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి కనీసం అభ్యర్థులు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. అందుకే అబద్దాలు చెప్పి గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు. తాము పదేళ్లుగా పూర్తి మెజార్టీలో ఉన్నా రిజర్వేషన్లు తీసివేయలేదని గుర్తించాలన్నారు. తెలంగాణలో మతపరమైన రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ అని... ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం వాటిని తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకే ఇస్తామని ఆయన సభా ముఖంగా హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గ్యారెంటీ ఇస్తే సాయంత్రానికి అంతా అయిపోతుందని ఎద్దేవా చేశారు. రూ.2 లక్షల రుణమాఫీ, రూ.12 వేల రైతు కూలీ, విద్యార్థినులకు స్కూటీ వంటి హామీలు నెరవేరలేదన్నారు. కాంగ్రెస్ అయోధ్య రామమందిర నిర్మాణాన్ని ఏళ్ల పాటు అడ్డుకుందని ఆరోపించారు. మోడీ హయాంలో రామాలయం పూర్తి చేశామన్నారు. రాజస్థాన్, తెలంగాణ ప్రజలకు కాశ్మీర్‌తో ఏం పని అని మల్లికార్జున ఖర్గే అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశ్మీర్ కోసం భువనగిరి వాసులు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కానీ ఆర్టికల్ 370ని రద్దు చేసి మోడీ కాశ్మీర్ మనదేనని చాటారన్నారు.
కేంద్రంలో బీజేపీ వచ్చాక ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని రూపుమాపామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్ పార్టీలు నిలువరించగలవా? అని ప్రశ్నించారు. ఎ అంటే అక్బరుద్దీన్, బీ అంటే బీఆర్ఎస్, సీ అంటే కాంగ్రెస్... ఇవన్నీ ఒక్కటేనని విమర్శించారు. ఈ మూడు పార్టీలు బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంటోందని మండిపడ్డారు. అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్టను కాంగ్రెస్ బహిష్కరించిందని అమిత్ షా గుర్తు చేశారు.