మంగళవారం, 28 జనవరి 2025
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికల సిత్రాలు
Written By మోహన్
Last Modified: శనివారం, 16 మార్చి 2019 (21:10 IST)

ఎన్నికలు 2019, రైలు ఇంజన్‌కి ముసుగు, మరి సైకిల్, హస్తం గుర్తులకు వేస్తారా?

బారామతి అనేది మహారాష్ట్రలోని ఓ పట్టణం. ఆ పట్టణంలో బ్రిటీష్ జమానాకు చెందిన ఓ ఆవిరి రైలింజనును స్మృతిచిహ్నంగా ఓ గద్దె మీద నిలబెట్టారు. ఎన్నికల నగారా మోగిందో లేదో దాని మీద అధికారులు ముసుగు కప్పారు.

నిబంధనల ప్రకారం ఏ పార్టీ గుర్తును పబ్లిక్ స్థలాల్లో ప్రదర్శించరాదు. శివసేన నుండి విడిపోయి సొంతకుంపటి పెట్టుకున్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్) ఎన్నికల గుర్తు రైలింజను. అందుకే అధికారులు దానికి ముసుగు వేసారని తెలిసింది. గమ్మత్తయిన విషయం ఏమిటంటే బారామతిలో ఎంఎన్‌ఎస్ పోటీ చేయడం లేదు. అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో పోటీచేస్తుందో లేదో కూడా తెలియదు.
 
బారామతి అంటే ఎన్సీపీ కంచుకోట. అక్కడ ఎన్సీపీ సుప్రీమో శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే ఎంపీగా పోటీ చేస్తున్నారు. కూటమి కట్టాల్సిందిగా ఎన్సీపీ పంపిన ఆహ్వానాన్ని ఎంఎన్‌ఎస్ తిరస్కరించింది. ఆ పార్టీకి మిగిలిన ఒక ఎమ్మెల్యే ఇటీవల గుడ్‌బై చెప్పి శివసేనలో చేరిపోయారు. కానీ అధికారులు మాత్రం రూలు రూలే అంటున్నారు. అందుకే రైలింజనుకు ముసుగేసి చేతులు దులిపేసుకున్నారు. కాగా యూపీలోనూ ఈ సమస్య ఉంది. 
 
మాజీ సీఎం మాయావతి నిర్మించిన దలితమూర్తుల పార్కులో బోలెడు పెద్ద పెద్ద ఏనుగుల బొమ్మలుంటాయి. ఏనుగు బీఎస్పీ ఎన్నికల గుర్తు అనే విషయం తెలిసిందే. అందుకే ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆ పార్కులోని ఏనుగులకు అధికారులు ముసుగులు కప్పుతారు. ఈ తంతు అలా కొనసాగుతూనే ఉంది. 
 
ఏనుగు బొమ్మకైతే ముసుగు వేస్తున్నారు సరే.. నిజమైన ఏనుగుకు ముసుగు వేయలేరు కదా. ఆటో, కారు, సైకిల్ వంటి ఎన్నికల గుర్తులు కూడా ఉన్నాయి. ఇక హస్తం సంగతి సరేసరి. మరి అన్నింటికీ ముసుగు వేయడం సాధ్యమవుతుందా? పోటీ చేయని ఎంఎన్‌ఎస్ గుర్తు అయిన రైలింజనుకు ముసుగు వేయించిన ఎన్నికల కమిషన్ తీరుతెన్నులపై నెటిజనులు జోకులు పేలుస్తున్నారు.