ఉత్తరాఖండ్ : ట్రెక్కింగ్‌కు వెళ్లిన 17 మందిలో 11 మంది మృతి
ఉత్తరాఖండ్‌లో విషాదం నెలకొంది. ట్రెక్కింగ్‌కు వెళ్లిన 17 మందిలో 11 మంది మృతులై తేలారు. భారీ హిమపాతం, ప్రతికూల వాతావరణం కారణంగా అక్టోబర్ 18 నుండి వీరి ఆచూకీ కానరాలేదు. దీంతో రంగంలోని వైమానిక దళం..వారు కనిపించకుండా పోయిన ప్రాంతం.. ఉత్తరాఖండ్‌కు 17వేల అడుగుల ఎత్తులో ఉన్న లమ్‌ఖగా పాస్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ చేపడుతోంది.
హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాను.. ఉత్తరాఖండ్‌లోని హర్సిల్‌తో కలిపే అత్యంత ప్రమాదకరమైన పాస్‌లలో లమ్‌ఖగా పాస్ ఒకటి. ఈ మార్గం నుండి ఇప్పటి వరకు 11 మంది మృత దేహాలను వెలికితీశారు. ట్రెక్కింగ్‌కు వెళ్లిన 17 మందిలో పర్యటకులు, పోర్టర్లు, గైడ్లు ఉన్నారు.
అక్టోబర్ 20న అధికారుల నుండి వచ్చిన కాల్‌తో భారత వైమానిక దళం స్పందించి... తేలికపాటి హెలికాఫ్టర్లను రెండింటినీ హిల్ స్టేషన్ హర్సిల్‌కు పంపింది. జాతీయ విపత్తు నిర్వహణకు చెందిన ముగ్గురు సభ్యులతో కూడిన బృందం హెలికాఫ్టర్‌లో 19,500 అడుగుల ఎత్తుకు చేరుకుని.. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొంది.