బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 మే 2021 (12:52 IST)

బెంగాల్ దంగల్ : చిత్తుగా ఓడిన కేంద్ర మంత్రి - భాజపా ఎంపీలు

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్ల ఒకరిద్దరు కేంద్ర మంత్రులు చిత్తుగా ఓడిపోయారు. మొత్తం ఎనిమిది విడతల్లో జరిగిన బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ మరోమారు జయభేరి మోగించింది. 
 
200కుపైగా స్థానాలు కైవసం చేసుకుని సత్తా చాటింది. అదేసమయంలో బెంగాల్‌లో అధికారంలోకి వస్తామని బీరాలు పలికిన బీజేపీ డబుల్ డిజిట్‌కే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. కేంద్ర సహాయమంత్రి సహా నలుగురు ఎంపీలను బరిలోకి దింపింది. వీరిలో ఎంపీ నిషిత్ ప్రామాణిక్ మినహా మిగిలి నేతలంతా చిత్తుగా ఓడిపోయారు. 
 
టోలీగంజ్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో, చున్‌చురా నుంచి పోటీ చేసిన ఎంపీ లాకెట్ ఛటర్జీ, తారకేశ్వర్ నుంచి బరిలోకి దిగిన రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్ గుప్తా టీఎంసీ అభ్యర్థుల చేతుల్లో ఓటమి పాలయ్యారు. అయితే, దిన్‌హటా స్థానం నుంచి పోటీ చేసిన ఎంపీ నిషిత్ ప్రామాణిక్ మాత్రం తన సమీప టీఎంసీ ప్రత్యర్థిపై 5,175 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
 
కాగా ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 213 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అలాగే, బీజేపీ కూటమి 77 సీట్లకే పరిమితం కాగా, ఇతరులు రెండు స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ, సీపీఎంలు ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేక పోయాయి. అదేసమయంలో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన టీఎంసీ అధినేత్ర మమతా బెనర్జీ కూడా తన ప్రత్యర్థి సువేంధు అధికారికి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు.