గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 మే 2021 (11:20 IST)

ఒక్క రూపాయి పంచని కమల్ హాసన్... ఒక్క సీటు ఇవ్వని తమిళ ఓటర్లు

భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరో కమల్ హాసన్. విలక్షణ నటుడిగా, దక్షిణాదిన కోట్లాది మంది సినీ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న హీరో. ముఖ్యంగా, పరిచయం అక్కర్లేని పేరు. 
 
తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 142 స్థానాల్లో పోటీ చేసిన కమల్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్, ఒక్కటంటే ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. 
 
తాను ఓట్ల కోసం డబ్బులు పంచబోనని, సరికొత్త రాజకీయ వాతావరణాన్ని సృష్టించడమే తన లక్ష్యమని ముందే ప్రకటించిన కమల్, అన్న మాటను చేసి చూపారు. ఫలితంగా విలువలకు కట్టుబడిన వ్యక్తిగా గెలిచిన ఆయన, ఓట్లను పొందడంలో మాత్రం ఓడిపోయారు.
 
ఈ ఎన్నికల్లో కమల్ సహా ఎంఎన్ఎం పార్టీ అభ్యర్థులంతా ఓడిపోయారు. ఎంఎన్ఎం తరఫున బరిలోకి దిగిన వారంతా ఎక్కడా డబ్బులు పంచలేదు. దీంతో వారెవరికీ ఓట్లు పడలేదని ఇప్పుడు కామెంట్లు వస్తున్నాయి. 
 
మరోవైపు, ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల అభ్యర్థులుగా బరిలోకి దిగిన అనేక మంది అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. వీరిలో సినీ నటి ఖుష్బూ, నటుడు మన్సూర్ అలీఖాన్, హాస్య నటుడు మయిల్ స్వామి, సినీ గేయరచయిత స్నేహనన్, దర్శకుడు సీమాన్, నటి శ్రీప్రియ తదితరులు ఉన్నారు. 
 
అయితే, డీఎంకే అభ్యర్థిగా బరిలోకి దిగిన హీరో ఉదయనిధి స్టాలిన్, ఆ పార్టీ తరపున బరిలోకి దిగిన సినీ నిర్మాత కుమార్ మాత్రం విజయం సాధించారు. అలాగే, కేరళలోని త్రిస్సూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సురేశ్ గోపీ ఓటమి పాలయ్యారు.