గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 మే 2021 (21:47 IST)

తుస్స్‌మన్న సినీ గ్లామర్ :: వెలగని కమల్ టార్చిలైట్ - ఖష్బూ ఓటమి

తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో సినీ గ్లామర్ ఏమాత్రం పనిచేయలేదు. ఎన్నో ఆశలతో ఎన్నికల గోదాలోకి దిగిన అనేక మంది సినీ నటులు చిత్తుగా ఓడిపోయారు. ఇలాంటి వారిలో విశ్వనటుడు కమల్ హాసన్, సినీ నటీమణులు ఖుష్బూ, శ్రీప్రియ, దర్శకుడు సీమాన్, హాస్య నటుడు మయిల్ స్వామి, నటుడు మన్సూర్ అలీఖాన్, సినీ గేయ రచయిత స్నేహనన్‌లు ఉన్నారు. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేసిన సినీ హీరో ఉదయనిధి స్టాలిన్, నిర్మాత అంబోత్ కుమార్‌లు గెలుపును సొంతం చేసుకున్నారు. 
 
ఏప్రిల్ 6వ తేదీన ఒకే దశలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగగా, మే 2వ తేదీ ఆదివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఫలితాల్లో కోయంబత్తూరు దక్షిణం స్థానం నుంచి బరిలోకి దిగిన కమల్ హాసన్ తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన వానతి శ్రీనివాసన్ చేతిలో 1650 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 
 
అలాగే, చెన్నై థౌజండ్‌లైట్ స్థానం నుంచి పోటీ చేసిన సినీ నటి ఖుష్బూ, మైలాపూరు స్థానంలో పోటీ చేసిన నటి శ్రీప్రియ, విరుగంబాక్కం సెగ్మెంట్‌లో పోటీ చేసిన సినీ గేయరచయిత స్నేహనన్, ఇదే స్థానంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన హాస్య నటుడు మయిల్ స్వామి, తొండాముత్తూరు స్థానంలో పోటీ చేసిన నటుడు మన్సూరు అలీఖాన్, తిరువొట్రియూరు స్థానం నుంచి బరిలోకి దిగిన సినీ దర్శకుడు సీమాన్‌లు ఓడిపోయారు.