బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 28 జులై 2020 (13:54 IST)

దేశంలో 50 శాతం మందికి కరోనా సోకడం ఖాయం!: నిపుణులు

కోవిడ్-19 మహమ్మారి రోజురోజుకు పంజా విసురుతోంది. దేశ వ్యాప్తంగా రోజుకు 30వేలకుపైగా కేసులు నమోదవుతుంటే... మన రాష్ట్రంలోనూ గత వారం రోజులుగా సరాసరి 7వేలకు పైగా కేసులు నమోదువుతున్నాయి. 
 
కోవిడ్-19 కేసులు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఉంది. మరోవైపు కేసుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన వ్యక్తులను, వారి కుటుంబ సభ్యుల పై వివక్షత చూపించటం  లాంటి వార్తలు నిత్యం చూస్తూ ఉన్నాం.
 
కోవిడ్-19 అనేది ఇప్పటికిప్పుడు.. కొందరితో అంతమయ్యేది కాదని దేశంలో దాదాపు 50 శాతం మందికి సోకడం ఖాయమని నిపుణులు చెప్తున్నారు. 
 
అందుకే కరోనా సోకిందన్న నెపంతో మీ పక్కనే ఉండే ఇల్లు కావొచ్చు అపార్ట్మెంట్ కావచ్చు దయచేసి తోటి వాళ్ళని వెలివేసినట్లు చూడకండి. మనం పోరాడాల్సింది కోవిడ్ వ్యాధితో గానీ వ్యక్తులతో కాదన్నది గుర్తుంచుకోవాలి. 
 
రేపు అదే పరిస్థితి ప్రతి ఒక్కరికీ రావొచ్చు. మన కుటుంబంలోని వారూ ఉండవచ్చు. అప్పుడు ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అందుకే కోవిడ్-19 బారినపడిన వారిపట్ల వివక్ష చూపవద్దు. మన పక్క ఇంటి వారో లేక ఫ్లాట్ వారో కోవిడ్ పాజిటివ్ అని తెలిస్తే అపార్ట్ మెంట్ లేదా చుట్టుపక్కల వారు  ఆ కుటుంబానికి అవసరమైనవన్నీ సమకూర్చండి.

వీలైతే రోజుకొక ఫ్లాటు వాళ్ళు హోమ్ ఐసోలేషన్లో ఆ కుటుంబానికి కావలసిన బ్రేక్ ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ వంటివి సిద్ధం చేసి డిస్పోజబుల్స్ లో ప్యాక్ చేసి వారి ఫ్లాట్ డోర్ దగ్గర లేక ఇంటి దగ్గర బయట వైపు పెట్టి వారికి సమాచారం ఇవ్వండి. కోవిడ్ నుంచి కోలుకునే వరకు వారిలో ధైర్యాన్ని నింపండి.
 
ఇలా చేయడం ద్వారా వారి అవసరాలన్నీ తీరుతాయి...
వారు బయటకు వచ్చి ఇతరులకు కోవిడ్ వ్యాప్తి చేసే అవకాశం కూడా ఉండదు. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో అనవసరమైన భయాందోళనలకు గురై మరణాల వరకు దారితీస్తున్నాయి. 
 
ఇప్పుడు కోవిడ్ ను ఎదుర్కోవడానికి కావాల్సింది మానసిక ధైర్యమే. పైగా మన కోసం ఇంత మంది ఉన్నారన్న ధీమా, భరోసా వారిలో కలుగుతుంది. రేపటి రోజు ఇలాంటి పరిస్థితి మనకూ రావొచ్చు. కాబట్టి మనకోసం అందరూ -అందరికోసం మనం అనుకోవాలి. 
 
మనం ఎంత జాగ్రత్తగా వున్నా కోవిడ్ వచ్చే ప్రమాదం పొంచి ఉందన్న విషయం ఇప్పటికే స్పష్టమవుతోంది. అత్యంత జాగ్రత్తలు తీసుకునే వివిఐపీలకే కోవిడ్ సోకి వ్యాధికి ఎవరూ అతీతుల కాదన్న నిజాన్ని గుర్తు చేస్తోంది. 
 
అందుకే మన మిత్రుల్లోనూ బంధువుల్లోనో మన చుట్టుపక్కల ఇళ్లలో ఉండేవారికి కోవిడ్ సోకినప్పుడు మనం మన జాగ్రత్తలు పాటిస్తూనే వారికి మన చేతనైనంత సహాయం చేద్దాం. 
 
ఆసాయం ఎంత చిన్నదైనా కావొచ్చు.  ఒక్క ఫోన్ కాల్ మీకు మేమున్నాం అన్న మనో దైర్యాన్ని కలిగిద్దాం. ఒకరికి ఒకరు అండగా ఉంటూ కోవిడ్ మమహ్మారిపై పోరాటంలో విజయం సాధిద్దాం.  
 
ముఖ్యంగా రాబోయే నెల రోజులు మరింత కీలకమైనవిగా చెప్పవచ్చు. వాతావరణంలో మార్పుల కారణంగా, వర్షాలు పడడం వల్ల జలుబు, దగ్గు లాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా తోడవుతున్నాయి. దీంతో కోవిడ్ వైరస్ వ్యాప్తి మరింత ఉంటే అవకాశం ఉంటుందని అంచానా. 
 
అందుకే అత్యవసరమైన పనులు ఉంటే తప్ప బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండడమే మంచిది. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే.. తప్పనిసరిగా మాస్కు ధరించండి.