మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 30 జూన్ 2020 (08:16 IST)

కరోనా వచ్చిన వారిపట్ల వివక్ష తగదు..అలాంటి వ్యక్తులపై క్రిమినల్ చర్యలు : నల్లగొండ ఎస్పీ

కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల పట్ల ఎవరైనా వివక్ష చూపవద్దని, హేళనగా మాట్లాడవద్దని, ఇంటి యజమానులు, చుట్టు పక్కల వ్యక్తులు ఇబ్బందులకు గురి చేయవద్దని నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ సూచించారు.
 
కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని వారికి ధైర్యం చెబుతూ వెన్నంటి నిలవాలని ఆయన జిల్లా ప్రజలను కోరారు.

పలు ప్రాంతాల నుండి కరోనా పాజిటివ్ వచ్చిన వారిని ఇంటి యజమానులు వేధిస్తున్నట్లుగా, ఇల్లు ఖాళీ చేయమని ఇబ్బందులు గురి చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సరైన జాగ్రత్తలు, ఆరోగ్య రక్షణ చర్యలు చేపట్టడం ద్వారా, రోగ నిరోధక శక్తిని శరీరంలో పెంచుకునే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పాజిటివ్ వచ్చిన చాలా మంది కోలుకున్నారని ఆయన గుర్తు చేశారు.

కరోనా సోకిన వ్యక్తుల పట్ల మానవత్వాన్ని ప్రదర్శించాలి తప్ప కఠినంగా వ్యవహరించడం సరైన విధానం కాదని ఆయన చెప్పారు. అలాంటి వ్యక్తులు త్వరగా కోలుకునే విధంగా వారు నిరాశకు లోను కాకుండా అధైర్యపడకుండా ధైర్యం చెప్పాలని ఎస్పీ సూచించారు.

అలా కాకుండా వారిని మానసికంగా హింసించేలా ప్రవర్తించినా, ఇల్లు ఖాళీ చేయాలని ఇబ్బందులకు గురి చేసినా, వారి పట్ల వివక్ష చూపించినా అలాంటి వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కష్టకాలంలో మనుషులు ఒకరికి ఒకరు అండగా నిలిస్తూ సమైక్యంగా కరోనాపై పోరాడాలని ఆయన జిల్లా ప్రజలను కోరారు.