గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (15:09 IST)

అట్టహాసంగా జయలలిత 69వ జయంతి.. పార్టీ అధిష్టానమే మా చేతికి వస్తుంది: ఓపీఎస్

అన్నాడీఎంకే మాజీ అధినేత్రి, దివంగత సీఎం జయలలిత 69వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జయలలిత చిత్రపటానికి సీఎం పళనిస్వామి, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ సహా మంత్రులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అ

అన్నాడీఎంకే మాజీ అధినేత్రి, దివంగత సీఎం జయలలిత 69వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జయలలిత చిత్రపటానికి సీఎం పళనిస్వామి, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ సహా మంత్రులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అమ్మ జీవిత విశేషాలను తెలిపే పుస్తకాన్ని విడుదల చేశారు. అమ్మ లేని లోటు పూడ్చలేదని.. ఆమె లోటు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోందని పార్టీ నేతలు తెలిపారు. అమ్మ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని ఈ సందర్భంగా సీఎం పళనిస్వామి స్పష్టం చేశారు.
 
అయితే కార్యకర్తల మద్దతును బట్టి తమ జట్టే అన్నాడీఎంకే అని ఓ పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన పన్నీర్ సెల్వం.. అన్నాడీఎంకే కార్యకర్తలు ఓటేయకుండా పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టడం ఏమాత్రం చెల్లుబాటు కాదన్నారు. అమ్మ ఒక్కరే అన్నాడీఎంకే కార్యకర్తల ఓటింగ్ ప్రకారం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారని చెప్పారు. కార్యకర్తల ఓటింగ్‌ లేకుండా ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టిన ఒకరు తమను పార్టీ నుంచి బహిష్కరించడం చెల్లుతుందా అంటూ పన్నీర్ సెల్వం ప్రశ్నించారు. ఇంకా అన్నాడీఎంకే నుంచి శశికళ తమను బహిష్కరించానని చెప్పడం చెల్లుబాటు కాదన్నారు.
 
అన్నాడీఎంకే కుటుంబ ఆధిక్యం కూడదని.. అన్నాడీఎంకేకు చెందిన 121 మంది ఎమ్మెల్యేలు తమవైపే ఉన్నారన్నారు. పార్టీ అధిష్టానం తనంతట అదే వచ్చి తమ వద్దకు చేరుతుందని చెప్పారు. నీతి నిజాయితీ మావైపు ఉండటం ద్వారా శశికళ విషయంలో ఎన్నికల కమిషన్ సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. జయలలిత మృతిపట్ల పలు అనుమానాలున్నాయని.. విచారణ కమిషన్ ఏర్పాటు చేసేందుకు సంకల్పించుకున్నానని.. కానీ ప్రభుత్వం తన చేతులో లేదని చెప్పారు. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వానికి అమ్మపై గౌరవం ఉంటే జయలలిత మృతి పట్ల విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో విచారణ కమిటీ వేసి అమ్మ మరణంపై విచారణ జరపాలన్నారు. అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు దారుణమని పన్నీర్ సెల్వం వ్యాఖ్యానించారు.