గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 30 డిశెంబరు 2019 (07:33 IST)

అజిత్ పవార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి?

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సోదరుడి కుమారుడు అజిత్ పవార్ మళ్లీ జాక్‌పాట్ కొట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎన్సీపీని వీడి బీజేపీతో జత కట్టిన అజిత్ ఉప ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణం చేశారు. అయితే ఆయన వెంట బీజేపీలోకి వచ్చేందుకు ఎన్సీపీ ఎమ్మెల్యేలు ముందుకు రాకపోవడంతో రెండు మూడు రోజుల్లోనే తిరిగి పార్టీ గూటికి చేరుకున్నారు.

ఆ తర్వాత ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి మహా వికాస్ అఘాది సర్కారు ఏర్పడినా అజిత్‌కు చోటు దక్కలేదు. శరద్ పవార్ తర్వాత పార్టీకి సర్వస్వంగా ఉన్న అజిత్ పవార్‌కు మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడంతో ఆయన వర్గీయులు నొచ్చుకున్నారు కూడా. అయితే ఉద్ధవ్ సీఎంగా బాధ్యతలు చేపట్టి నెల రోజులు దాటినా ఇప్పటివరకూ మంత్రివర్గ విస్తరణ జరగలేదు.

నవంబర్ 29న ఉద్ధవ్‌తో పాటు ఎన్సీపీ తరపున ఛగన్ భుజ్‌బల్, జయంత్ పాటిల్, శివసేన తరపున ఏక్‌నాథ్ షిండే, సుభాష్ దేశాయ్, కాంగ్రెస్ తరపున బాలాసాహెబ్ థోరట్, నితిన్ రౌత్ ప్రమాణం చేశారు. అయితే మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగలేదు.

మంత్రివర్గ విస్తరణపై, మంత్రిత్వ శాఖల కేటాయింపులపై అనేక పుకార్లు షికారు చేసినా విస్తరణ మాత్రం జరగలేదు. సేన తరపున 16, ఎన్సీపీ తరపున 14, కాంగ్రెస్ తరపున 12 మంది మంత్రులుంటారని తొలుత ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాలేదు.
 
తాజాగా సోమవారం మంత్రివర్గ విస్తరణ జరగనుంది. కాంగ్రెస్ తరపున 12 మంది మంత్రులు ప్రమాణం చేస్తారని వీరిలో పది మంది కేబినెట్ ర్యాంక్ మంత్రులుంటారని కాంగ్రెస్ పార్టీ నేత, మంత్రి బాలాసాహెబ్ థోరట్ తెలిపారు. కాంగ్రెస్ తరపున మంత్రిపదవులు చేపట్టనున్న వారి జాబితా మరికాసేపట్లో విడుదల చేస్తామన్నారు.
 
అటు శరద్ పవార్ అధ్యక్షతన ఎన్సీపీ కీలక సమావేశం జరుగుతోంది. అజిత్ పవార్‌కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు కీలకమైన హోం శాఖ కూడా దక్కినట్లు తెలుస్తోంది. దీంతో అజిత్ వర్గీయులు సంబరాలకు సంసిద్ధమౌతున్నారు.
 
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమిగా పోటీ చేశాయి. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో అధికారం చేపట్టేందుకు కావాల్సిన 145 మ్యాజిక్ నెంబర్‌ను మించి బీజేపీ-శివసేన కూటమికి స్థానాలు దక్కాయి.

అయితే అనూహ్యంగా శివసేన ఎన్సీపీ-కాంగ్రెస్‌తో జత కట్టి మహా వికాస్ అఘాది సర్కారు ఏర్పాటు చేసింది. అయినా మంత్రి పదవుల పంపకాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మంత్రివర్గ విస్తరణ ఇంతకాలం జరగలేదు.